పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా పాఠశాలకు విద్యా సామాగ్రి వితరణ
సత్తుపల్లి,(విజయ క్రాంతి): పొంగులేటి రాఘవరెడ్డి స్వరాజ్యం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పొంగులేటి మాధురి సుమారు రూ.25 వేల విలువైన విద్యా సామగ్రిని పట్టణంలోని వెంగల్ రావు నగర్ పాఠశాలకు విద్యాసామాగ్రిని గురువారం అందజేశారు. విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్, రైటింగ్ ప్యాడ్లు, టేబుల్ బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, చూచిరాత పుస్తకాలు, కలర్ పెన్సిల్స్, క్లాస్‌మేట్ నోటుబుక్స్ తదితర సామగ్రిని పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి ఎన్. రాజేశ్వరరావు మాట్లాడుతూ, పి ఎస్ ఆర్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు ఇలా అందించటం అభినందనీయమని, వీటి ద్వారా విద్యార్థులు విద్య నేర్చుకోవడానికి దోహదపడతాయని, ట్రస్ట్ అధినేతలకు అభినందనలు తెలియజేశారు. విద్యార్థులను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పాఠశాలకు పంపాలని, ఇంటి వద్ద కూడా రోజూ చదివించేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే పాఠశాల, తల్లిదండ్రులు, సమాజం కలిసి పనిచేయాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా ఇటీవల పాఠశాలకు డెస్క్-బెంచీలు అందించిన ఎంఈఓ ఎన్. రాజేశ్వరరావు విద్యార్థుల తల్లిదండ్రులు ఘనంగా సన్మానించి తమ కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ రావు, సహోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి, ఏ ఏ పీ ఎస్ చైర్మన్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం ఉదారంగా సహకరించిన పొంగులేటి రాఘవరెడ్డి స్వరాజ్యం చారిటబుల్ ట్రస్ట్, పొంగులేటి మాధురి, కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ తల్లిదండ్రులకు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ వెంగళరావు నగర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.






