10-04-2025 01:33:24 AM
రెండు గంటల్లో అమరావతి చేరుకునే అవకాశం
హైదరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): తెలంగాణ, ఏపీకి కేంద్ర ప్రభు త్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని తెలంగాణ, ఏపీకి సం బంధించిన పలు అంశాలపై ఆయా శాఖలకు కేంద్ర హోంశాఖ బుధవారం ఆదేశా లు జారీచేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి ఏపీలోని అమరావతి మధ్యన గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించేందుకు కేంద్రం అంగీకరించింది.
డీపీఆర్ రూపకల్పనకు చర్యలు ప్రారంభించాలని కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణాశాఖను హోంశాఖ ఆదేశించింది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి మీదుగా అమరావతికి సుమారు 275 కి.మీ దూరం ఉండగా... కేంద్రం ప్రతిపాదిస్తున్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణాన్ని సుమారు 200 కి.మీ పూర్తి చేయనున్నారు.
ఫలితంగా సుమారు 75 కి.మీ దూరం తగ్గడంతో పాటు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే కావడంతో కేవలం 2 గంటల్లో హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకునేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. గేమ్ ఛేంజర్‌గా మారే ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను త్వరగా చేపట్టాలని రెండు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు. సాధ్యమైనంత త్వరగా డీపీఆర్ సిద్ధంచేసి పనులు చేపట్టేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఆర్‌ఆర్‌ఆర్ అనుమతులు వేగవంతం...
రాష్ర్టంలోని రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగానికి అనుమతుల ప్రక్రియ వేగవంతానికి చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన నిధులు పెండింగ్‌లో ఉన్నందున ఈ విషయంపై నీతిఆయోగ్‌తో చర్చించాలని అధికారులకు హోంశాఖ సూచించింది.
కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 3న కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ 15 శాఖల అధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. కేంద్ర రోడ్లు-ఉపరితల రవాణా, బొగ్గు గనులు, ఉక్కు, వ్యవసాయ, రైల్వే, పెట్రోలియం తదితర శాఖల ఉన్నత అధికారులతో సమీక్షించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల ప్రతిపాదనలతో పాటు విభజన చట్టం ప్రకారం ఉన్న పెండింగ్ అంశాలపై కూడా చర్చించారు. ఆ సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను ఇటీవల రెండు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర హోంశాఖ పంపించింది.