calender_icon.png 17 November, 2025 | 4:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సౌదీ బస్సు ప్రమాదంపై మంత్రుల సంతాపం

17-11-2025 02:37:31 PM

హైదరాబాద్: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్, కొండా సురేఖ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. సౌదీ బస్సు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం మంత్రి కోమటిరెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అందులో హైదరాబాద్‌కు చెందిన వారు ఉన్నారన్న వార్త మరింత కలచివేస్తోందన్నారు. ఈ విషాద ఘటనలో మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉన్నారన్న సమాచారం హృదయాన్ని విచారానికి గురిచేస్తోందని తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారందరి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. బాధిత కుటుంబాలకు ఈ కష్ట సమయంలో భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు.

సౌదీలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం చాలా బాధాకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మృతుల్లో హైదరాబాద్ వాసులు ఉన్నారన్న వార్త విచారకరమని, సౌదీ ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ వినోద్, వైస్ చైర్మన్ భీమ్ రెడ్డితో తను మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరిగిందన్నారు. అధికారులకు ఎన్నారై కమిటీతో సమన్వయం చేస్తూ వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మృతులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబాలకు హృదయపూర్వకంగా సానుభూతి తెలిపారు. ప్రభుత్వం వారి బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా కల్పించారు.

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన పలువురు యాత్రికులు మృతి చెందిన వార్త అత్యంత విషాదకరమని మంత్రి కొండా సురేఖ అన్నారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని అన్ని చర్యలు చేపడుతోందని మంత్రి వెల్లడిచారు. ఈ ప్రమాదంపై తెలంగాణ మంత్రలు ఎక్స్ లో పోస్టు చేశారు.