16-02-2026 03:23:04 PM
హైదరాబాద్: తెలంగాణలోని మునిసిపాలిటీల చైర్‌పర్సన్‌లు, కార్పొరేషన్లకు మేయర్‌లను సోమవారం మధ్యాహ్నం ఎన్నిక జరుగుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం నుంచి గెలిచిన కౌన్సిలర్లు, స్వతంత్ర అభ్యర్థులు కూడా శిబిరాల నుంచి మున్సిపల్ కార్యాలయాలకు చేరుకుని చైర్‌పర్సన్‌లు, మేయర్‌లను ఎన్నుకునే ముందు ప్రమాణ స్వీకారం చేశారు. హంగ్ తీర్పును నమోదు చేసిన 37 మునిసిపాలిటీలలో గందరగోళం నెలకొంది. పలు కారణాల వల్ల తెలంగాణలోని 11 మున్సిపాలిటీల్లో ఎన్నిక వాయిదా(Chairman elections postponed) పడింది. ఇల్లెందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, క్యాతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామ, తొర్రూరులో ఎన్నిక వాయిదా పడినట్లు అధికారులు తెలిపారు.
ఇబ్రంహీపట్నం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడటంతో ఆందోళన నెలకొంది. వాయిదా పడటంతో బీఆర్ఎస్ నేతలు పెద్దఎత్తున మున్సిపల్ ఆఫీసుకు చేరుకున్నారు. అప్రమత్తమై రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు. జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో కూడా గందరగోళం చోటుచేసుకుంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేయాలని కాంగ్రెస్ ఎంపీ సామల కిరణ్ కుమార్ రెడ్డి పోడియం ముందు బైఠాయించారు.
అటు ఎంపీ కడియం కావ్యపై బీఆర్ఎస్ నేతలు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. తొర్రూర్‌లో కావ్యకు ఎక్స్ అఫిషియో ఓటు ఇవ్వడంపై భారత్ రాష్ట్ర సమితి అభ్యంతరం వ్యక్తం చేసింది. తొర్రూరు మున్సిపాలిటీలో సోమవారం మధ్యాహ్నం చైర్‌పర్సన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభానికి ముందు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య ఘర్షణ జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులకు పార్టీ నేతల మధ్య తోపులాట జరిగింది.