అధికార మార్పు.. ప్రజా తీర్పు
భారత ప్రజాస్వామ్యం మరోసారి తన శక్తిని, స్వరాన్ని, అ సలు స్వభావాన్ని, స్పందనను గట్టిగా వినిపించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం. ఈ ఫలితాలు ప్రజల ఆశలు, నిరాశలు అంతర్మథనం, ప్రజల ఆలోచనా మార్పునకు సంకేతంగా నిలిచా యి. ఈ ఫలితాలను ఒకే కోణంలో చూడరాదు. ప్రాంతీయ భా వోద్వేగాలు, నాయకత్వ ప్రభావం, సంక్షేమ రాజకీయా లు, అభివృద్ధి వాగ్దానాలు, కుల మత సమీకరణాలు, యువత ఆలోచనా విధానం అన్నింటి మిశ్రమమే ఈ తీర్పు.
తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్య సాగు తున్న ద్వంద్వ రాజకీయ పోటీకి ప్రజలు బ్రేక్ వేసి కొత్త పార్టీ టీవీకేను గెలిపించడమనేది సాధారణ పరిణామం కాదు. ఇది ఒక రాజకీయ తిరుగుబాటు. ప్రజలు పాత పార్టీలను వదిలి కొత్త ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్నారు. టీవీకే ఎదుగుదల వెనుక ప్రధాన కారణం యువత. అవినీతి ఆరోపణలు, నాయకత్వంలో కొత్తదనం లేకపోవ డం ఈ అన్నీ కలిపి యువతలో ఒక అంతర్గత అసహనాన్ని పెంచాయి. ఆ అసహనా నికి తమిళ వెట్రి కజగం ఒక వేదికగా మారింది.
విజయ్ తన ప్రసంగాల్లో వ్యవస్థ మారాలని, రాజకీయాలు ప్రజలకు దగ్గర కావాలనే సందేశాన్ని పదేపదే చెప్ప డం, మ్యానిఫెస్టోలో పారదర్శక పాలన, యువతకు ఉద్యోగ అవకాశాలు, అవినీతి నిర్మూలన, విద్య, ఆరోగ్య రంగాలకు ప్రా ధాన్యం వంటి అంశాలను స్పష్టంగా ఉంచడం ప్రజలను ఆకర్షించింది. నాయకత్వలోపం, అంతర్గత విభేదాలు ఏఐఏడీ ఎంకేకి నష్టాన్ని కలిగించాయి. ప్రజల అంచనాలను అందుకోలేకపోవడం, కు టుంబ రాజకీయాలపై విమర్శలు, అవినీతి ఆరోపణలు డీఎంకే పట్ల అసంతృప్తిని పెంచాయి. అందుకే ప్రజలు మార్పును కోరుకున్నారు. హంగ్ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో టీవీకేకు బయటి మద్దతు తప్పదు. అయితే, పాత పార్టీలతో చేతులు కలిపితే టీవీకే విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ దశలో సిద్ధాంతాలా, అధికారమా? అన్న ముఖ్యమైన ప్రశ్న ఉదయిస్తున్నది.
దీదీ కోటకు బీటలు
పశ్చిమబెంగాల్‌లో ఈసారి వచ్చిన ఫ లితాలు శక్తివంతమైన రాజకీయ సంకేతమని చెప్పవచ్చు. బీజేపీ స్పష్టమైన ఆధి క్యం సాధించడం మమతా బెనర్జీకి గట్టి హె చ్చరిక. బీజేపీ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన అంశాలు సంఘటిత క్యాడర్, వ్యూహాత్మక ప్రచారాలే. మరో వైపు, టీఎంసీలో పెరిగిన అసంతృప్తి, అవినీతి ఆరోప ణలు, రాజకీయ హింస అన్ని కలిసి ప్రతికూల వాతావరణాన్ని సృష్టించాయి.
అసోంలో బీజేపీ గెలుపు ఏమాత్రం ఆశ్చర్యపరచలేదు. ఇది స్థిరమైన రాజకీయ నిర్మాణానికి సంకేతం. గత కొన్నేళ్లుగా ఆ పార్టీ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, జాతీయ భద్రత వంటి అంశాలను ముం దుకు తీసుకువచ్చింది. కాంగ్రెస్ సహా ఇతర ప్రాంతీయ పార్టీలు బలమైన ప్రత్యామ్నాయాన్ని చూపించకపోవడం బీజేపీకి కలిసొచ్చింది.
కేరళంలో యూడీఎఫ్ గెలుపు సాధారణ రాజకీయ మార్పు కాదు, ఇది ప్రజల్లో పెరిగిన అసంతృప్తికి ప్రతిబింబం. ఎల్డీఎఫ్ పాలనలో అవినీతి ఆరోపణలు, పరిపాలనా లోపాలు, ప్రజల్లో ఉన్న అసంతృప్తిని యూడీఎఫ్ తనకు అనుకూలంగా మలుచుకుంది. విమర్శలు చేయడమే కాదు, ప్రత్యామ్నాయ దృక్కోణాన్ని కూడా చూపడంతో యూడీఎఫ్ గెలవగలిగింది.
పుదుచ్చేరిలో బీజేపీ కూటమి విజయానికి రాజకీయ ప్రాముఖ్యత చాలా పెద్దది. స్థానిక పార్టీలతో కలసి పనిచేయడం ద్వా రా ఓటు విభజనను బీజేపీ నివారించింది. ఈ వ్యూహం వారికి ఫలితాన్నిచ్చింది.
చివరికి ప్రజలే రాజులు
ఈ ఐదు రాష్ట్రాల ఫలితాలను సమగ్రంగా పరిశీలిస్తే భారత రాజకీయాల్లో ఒక విస్తృతమైన మార్పు స్పష్టంగా కనిపిస్తోం ది. ఇవి కేవలం ఎన్నికల ఫలితాల సమాహారం కాదు, ప్రజల ఆలోచనా విధానం లో వచ్చిన లోతైన పరివర్తనకు ప్రతిబింబం. గతంలో కులం, మతం, ప్రాంతం వంటి గుర్తింపుల ఆధారంగా ఓటు వేయ డం ప్రధాన ధోరణిగా ఉండేది. కానీ, ఇప్పు డు ఆ ధోరణి క్రమంగా తగ్గుతూ, పనితీరు, నాయకత్వం, విశ్వసనీయత అనే మూడు కీలక ప్రమాణాలు ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ప్రజలు ఇప్పుడు ఎవరు వాగ్దానాలు చేస్తారో కాదు, ఎవరు వాటిని అమలు చేస్తారో అనే దానిపై దృష్టి పెడుతున్నారు. తమిళనాడులో టీవీకే గెలుపు, కేరళలో యూడీఎఫ్ విజయం ప్రజల్లో మార్పును సూచిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కొత్త రాజకీయ శక్తులకు అవకాశాలు విస్తరిస్తున్నాయి. తమిళ నాడులో టీవీకే విజయం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇది ఒక ప్రాంతీయ సంఘటనగా కనిపించినా దీని వెనుక ఉన్న సందే శం జాతీయ స్థాయికి విస్తరించే సామర్థ్యం కలిగి ఉంది. ప్రజాస్వామ్యంలో కొత్త ఆలోచనలు, కొత్త నాయకత్వం రావడం సహ జం మాత్రమే కాదు, అవసరం కూడా. ఇదే సమయంలో పాత రాజకీయ పార్టీలకు ఇది గట్టి హెచ్చరిక. ప్రజలతో అను సంధానం కోల్పోతే ఎంత పెద్ద పార్టీ అయి నా ఓడిపోక తప్పదు. డీఎంకే పరిస్థితి దీని కి నిదర్శనం. పశ్చిమ బెంగాల్ ఫలితాలు రాజకీయ మార్పును మరింత విస్తృతంగా అర్థం చేసుకునేలా చేస్తాయి.
ఇది రాష్ట్రం లో అధికార సమీకరణ మార్పు కాదు, జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపే పరిణామం. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలకు ఇది ఒక స్పష్టమైన హెచ్చరికగా మారింది. విభజితంగా పోటీచేస్తే ఓటు విభజన వల్ల బలహీనత ఏర్పడుతుంది. ఐక్యత లేకుండా బలమైన ప్రత్యామ్నా యం ఇవ్వడం కష్టమవుతుంది. ఈ పరిణామాలన్నింటిని కలిపి చూస్తే ఒక పెద్ద రాజ కీయ ధోరణి బయటపడుతోంది. ప్రాంతీ య పార్టీలపై జాతీయ పార్టీల ప్రభావం పెరుగుతోంది. అయితే ఇది పూర్తిగా ఒకే దిశలో సాగే మార్పు కాదు. ప్రాంతీయ శక్తులు కూడా కొత్త రూపంలో, కొత్త శైలిలో తిరిగి ఎదుగుతున్నాయి. ఒకవైపు జాతీయీకరణ, మరోవైపు స్థానికీకరణ ఈ రెండు ప్రక్రియలు ఒకేసారి జరుగుతున్నాయి
దీన్ని మొత్తం కలిపి చూస్తే భారత రాజకీయాల్లో ఒక రీసెట్ జరుగుతోంది. ఓటర్లు ఇక మౌన ప్రేక్షకులు కాదు, వారు చురుకైన నిర్ణయకర్తలు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రతి రాజకీయ పార్టీకి దిశానిర్దేశం చేస్తున్నాయి. పాత పార్టీలు తమ వైఖరిని మార్చుకోవాలి. కుటుంబ రాజకీయాలు, అవినీతి, అహంకారం ప్రజలకు అసహ్యం కలిగిస్తున్నాయి. కొత్త పార్టీలకు ఈ తీర్పు హెచ్చరిక, అవకాశం, మార్గదర్శకం. ఎవరు దీనిని అర్థం చేసుకుంటారో వారు రేపటి రాజకీయాన్ని నిర్మిస్తారు. ఎవరు పట్టించుకోరో వారు చరిత్రలో కనుమరుగైపోతా రు. ప్రజలే రాజులు అనే సత్యాన్ని మరోసారి గుర్తుచేసిన ఎన్నికలు ఇవి.
వ్యాసకర్త సెల్: 8466827118






