విజయ్ విజిల్ పోడు!
ద్రవిడ రాజకీయాలకు పెట్టింది పేరైన తమిళనాడులో సంచలనం నమోదైంది. ఒకసారి డీఎంకే, మరోసారి అన్నాడీఎంకే అధికార పీఠాన్ని పంచుకునే దశాబ్దాల సంప్రదాయానికి తమిళనాట తెరపడింది. ఏడున్నర దశాబ్దాల డీఎంకే, ఐదు దశాబ్దాల ఏఐడీఎంకే పార్టీలకు నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) షాక్ ఇవ్వడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, అధికార మార్పులోనూ తమిళ ప్రజలు తమ ప్రత్యేకతను నిలుపుకోవడం విశేషం.
తమిళనాడులో జాతీయ పార్టీలకు చోటులేదని చాటిచెబుతూ మరోసారి ప్రాంతీయ పార్టీ టీవీకేకు తమిళులు పట్టం కట్టారు. ఆ పార్టీ అధినేత విజయ్ పోటీచేసిన రెండు స్థానాలు పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్‌లో విజయఢంకా మోగించి సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నా రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీ రామారావు లాగా, 2 సంవత్సరాల రెం డు నెలల కిందట పురుడుపోసుకున్న టీవీకేను విజయపథంలోకి నడిపిం చి విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించారు.
కాగా, ఒంటరిగా పోటీచేసిన టీవీకే 107 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించడం గమనార్హం. సంస్థాగత నిర్మాణం, బలమైన క్యాడర్, పెద్ద పెద్ద లీడర్లు లేనప్పటికీ, టీవీకే ఘన విజయం సాధించడం వెనుక ప్రధానంగా యువ ఓటర్లు ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల అవినీతి పాలన, వారసత్వ రాజకీయాలు, నిరుద్యోగ సమస్యలతో విసిగివేసారిపోయిన తమిళ ప్రజలకు టీవీకే ఒక ఆశాకిరణంలా కనిపించింది.
అదే సమయంలో సంప్రదాయ పార్టీల వలె విజయ్ కూడా 5 లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగులకు రూ.4 వేలు భృతి, మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థికసాయం, ఏడాదికి ఆరు ఉచిత గ్యాస్ సిలిండర్లు, నూతన వధువుకు 8 గ్రాముల బంగారం లాంటి హామీలు ఇవ్వడం యువతతోపాటు సామాన్య ప్రజలను కూడా ఆకర్షించిందని చెప్పాలి. ఈ హామీలే కాకుండా పారదర్శక వ్యవస్థ, అవినీతి లేని పాలన అందిస్తానని మ్యానిఫెస్టోలో చేర్చడం టీవీకేకు కలిసొచ్చింది.
అయితే, తనపై నమ్మకముంచిన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత విజయ్‌పై ఉందని చెప్పక తప్ప దు. కాగా, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన 118 స్థానాలను కైవసం చేసుకోని నేపథ్యంలో ఇతర పార్టీల మద్దతు తీసుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో టీవీకే చిన్న పార్టీలను కలుపుకొని పోతుందా? లేదా సిద్ధాంతాలను పక్కనపెట్టి డీఎంకే, అన్నాడీఎంకేలలో ఒకరితో చేతులు కలుపుతుందా? అన్నది ఆసక్తికరం.






