విగ్రహ రూపం మార్చడం మూర్ఖత్వం
- ప్రభుత్వం మారితే విగ్రహాలు మార్చడం సరికాదు
- ఏడాది గడువిచ్చినం.. ఇక ఎండగడదాం
- ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీద్దాం
- అన్ని రంగాల్లోనూ రేవంత్ సర్కార్ విఫలం
- బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు
- సభలో వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం
హైదరాబాద్/సిద్దిపేట, డిసెంబర్ 8 (విజయక్రాంతి): ప్రభుత్వం మారితే తెలంగాణ తల్లి విగ్రహాల రూపురేఖలు మార్చడం మూర్ఖత్వమని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఏడాది పాలన పూర్తి చేసుకున్న కాంగ్రెస్‌కు తగినంత సమయం ఇచ్చామని, సర్కారు చేతకానితనం వల్ల రాష్ట్రం అస్తవ్యస్తంగా మరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏడాది గడిచిన తర్వాత కూడా బీఆర్‌ఎస్ మాట్లాడకుంటే మంచిది కాదని, ప్రజలు కూడా క్షమించరని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించినోళ్లపై ప్రభుత్వం పగబడుతున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనపై విసుగుచెందిన రాష్ర్ట ప్రజలు తిరగబడుతున్న నేపథ్యంలో, తెలంగాణను తెచ్చి పదేండ్లు ప్రగతి పథాన నిలిపిన పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్‌ఎస్ అసెంబ్లీని వేదికగా చేసుకుని ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ ఎమ్యెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు.
సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఉభయ సభల్లో పార్టీ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై అధినేత కేసీఆర్ చర్చించా రు. రాష్ర్ట ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణి, మోసపూరిత వైఖరిని నిలదీయాలని సూచించారు.
ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా గొంతువిప్పాలని, లగచర్లలో ఫార్మా ఫ్యాక్టరీ పేరుతో తమ భూములు గుంజుకుంటున్నారని రోడ్లమీదికి వచ్చిన గిరిజనుల మీద ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తున్నదని, ఈ అంశంపై ప్రభుత్వ తీరును ఎండగట్టాలని స్పష్టంచేశారు. మూసీ సుందరీకరణ పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల నివాసాలను కూలగొడుతున్నదని, ఇది ఎంత మాత్రం క్షమించరానిదని చెప్పారు.
హైడ్రా, మూసీ ముసుగులో పేదల ఆవాసాలను బుల్డోజర్లతో కూల్చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై ఆయన నిప్పులు చెరిగారు. ఫిబ్రవరిలో కమిటీల ఏర్పాటు తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ వైఫల్యాలపై ఎండగడ దామని పిలుపునిచ్చారు.
బీఆర్‌ఎస్‌ను బద్నాం చేసేందుకు కాళేశ్వరం
నమ్మి ఓట్లేసిన నిరుపేదలు, రైతులు, గిరిజనులు, దళితులను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని కేసీఆర్ ధ్వజమెత్తారు. అన్ని వర్గాలను రేవంత్ ప్రభుత్వం వంచించిందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ను బద్నాం చేసేందుకు కాళేశ్వరం అంశాన్ని ముందుకు తెచ్చిం దని విమర్శించారు. వృథాగా సముద్రంలో కలుస్తున్న కాళేశ్వరం జలాలను ఎందుకు ఎత్తిపోస్తలేరని ప్రశ్నించారు.
తమ హయాం లో దేశంలోనే అత్యంత ఎక్కువ జీతాలు తీసుకున్న ఉద్యోగులుగా తెలంగాణ ఉద్యోగులు నిలిచిపోయారన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వారికి డీఏల విషయంలో మొం డి చేయి చూపిందన్నారు. రాష్ర్టంలోని గురుకుల విద్య రోజురోజుకూ దిగజారుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. తినే తిండిని కూడా సరిగ్గా వండి పెట్టని దుస్థితి ఏర్పడిందన్నారు.
పిల్లలకు విషాహారం పెట్టడం వల్ల పిల్లలు చనిపోతున్నారని మండిపడ్డారు. గురుకులాల్లో సమస్యలను తెలుసుకునేందుకు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్‌తో పాటు మరో నలుగురు సభ్యులతో కమిటీ వేసినట్లు కేసీఆర్ చెప్పారు. గురుకులాలనే సక్రమంగా నడపలేని , పిల్లలకు చదువును అందించడం చేతగాని ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు.
తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చారిత్రక సందర్భం
తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ అస్థిత్వం, ప్రజల ఆకాంక్షల గురించి ఏ మాత్రం సోయిలేని రేవంత్‌రెడ్డి రాజకీయ స్వార్థంతో, కేసీఆ ర్ మీద కక్షతో మూర్ఖపుతనంతో విగ్రహాన్ని మారుస్తున్నారన్నారు. ఇటువంటి పిచ్చిపనులకు పూనుకోవడం శోచనీయమన్నారు. తెలంగాణ తల్లిని ఒక చారిత్రక సందర్భంలో ఏర్పాటు చేశామన్నారు.
తెలంగాణ తల్లి భావన కేసీఆర్‌ది కాదని, యావత్ తెలంగా ణ సమాజానిదని చెప్పారు. 70 ఏండ్ల క్రిత మే దాశరథి, రావెల్ల వెంకట్రామారావు వంటి తెలంగాణ కవులు తెలంగాణ తల్లి గురించి కీర్తించారని చెప్పుకొచ్చారు. చారిత్ర క నేపథ్యం, తెలంగాణ సాంస్కృతిక వారసత్వం గురించిన కనీస అవగాహన లేని కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ సీఎం పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
కాగా, తనను విగ్రహావిష్కరణకు ఆవిష్కరించడంపై కూడా కేసీఆర్ స్పందించారు. ‘నన్ను ఆహ్వానించడం వెనక కోణం ఏదున్నా.. వారి ఉద్దే శ్యం ఏదైనా.. మన ఇంటికి అతిథులు వస్తే మర్యాదచేస్తం గౌరవిస్తం. అదే పద్ధతిలో వచ్చిన మంత్రిని వారి వెంట వచ్చిన వారికి భోజనం పెట్టి సాదరంగా గౌరవించి పంపి నం. ఇది తెలంగాణ సంప్రదాయం’ అని కేసీఆర్ వివరించారు.
అస్తవ్యస్తంగా వ్యవసాయ రంగం
తన ఆనవాల్లు లేకుండా చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి యాదాద్రి పవర్ ప్లాంట్‌ను ప్రారంభించారని, అది తన ఆనవాలు అని తెల్వదా అని కేసీఆర్ ప్రశ్నించారు. రాష్ర్టంలో అస్తవ్యస్తంగా మారిన వ్యవసాయ రంగం, రైతు సంక్షేమంపై కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. రైతుబంధును పెంచుతాం అని రైతు లకు ఆశలు పెట్టి ఉన్న దాన్ని ఎగ్గొడుతున్న ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ప్రశ్నించాలని సూచించారు.
ఇలా ప్రతి అంశంపై అటు అసెంబ్లీలో ఇటు మండలిలో గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్ నిత్యం పార్టీ శ్రేణులతో సమస్యలతో వచ్చే ప్రజలతో జనతా గ్యారేజీలా మారిందనే వార్తలను కేసీఆర్ ప్రస్తావించి నాయకులను అభినందించారు. సమస్యల మీద మరింత లోతుగా అధ్యయనం చేసి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన ప్రగతి పాలనను గుర్తుచూ స్తూ కాంగ్రెస్ అస్తవ్యస్త పాలనను నిలదీయాలని స్పష్టంచేశారు.
కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మండలి డిప్యూ టి చైర్మన్ బండా ప్రకాశ్, బీఆర్‌ఎస్ పక్షనేత మధుసూధనాచారి, ముఖ్యనేతలు హరీశ్‌రా వు, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్‌యాదవ్, పద్మారావుగౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, వాణీదేవి, సత్యవతిరాథోడ్, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.






