29-01-2026 12:00:00 AM
తాజాగా నాంపల్లి కోర్టులో ఈడీ దాఖలు
రూ.11.30 కోట్ల బినామీ ఆస్తుల గుర్తింపు
నయీం భార్య హసీనా బేగంతో సహా 10 మందిపై అభియోగాలు
స్వీకరించిన కోర్టు.. నిందితులకు త్వరలో నోటీసులు
పొలిటికల్, పోలీస్ లింకులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నజర్
హైదరాబాద్, సిటీ బ్యూరో జనవరి 28 (విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు వణుకు పుట్టిం చిన గ్యాంగ్‌స్టర్ నయీం అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక అడుగు వేసింది. మనీలాండరింగ్ ఆరోపణలపై సుదీర్ఘంగా దర్యాప్తు జరిపిన అధికారులు, తాజాగా హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో సమగ్ర చార్జీషీట్ దాఖలు చేశారు. ఈ చార్జీషీట్ ను పరిశీలించిన కోర్టు, విచారణకు స్వీకరించింది. దీంతో నయీం కుటుంబ సభ్యులు, అనుచరుల చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. నయీం తన గ్యాంగ్‌తో కలిసి సెటిల్‌మెంట్లు, భూకబ్జాల ద్వారా సంపాదించిన సుమారు రూ.11.30 కోట్ల విలువైన 35 ఆస్తులను ఈడీ ఇప్పటికే గుర్తించింది. ఇందులో ప్రధానంగా యాదాద్రి జిల్లాలోని ఖరీదైన షాపింగ్ కాంప్లెక్స్‌లు, వందల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ ఆస్తుల న్నీ నయీం తన భార్య హసీనా బేగంతో పాటు సన్నిహితులు, ఇతర బినామీల పేర్లపై రిజిస్టర్ చేసినట్లు అధికారులు ధ్రువీకరించారు.
నయీం ప్రధాన అనుచరుడు పాశం శ్రీనివాస్‌తో పాటు, నయీం భార్య హసీనాబేగం, మహ్మద్ తాహెరా బేగం, మహ్మద్ సలీమా బేగం, మహ్మద్ అబ్దుల్ సలీమ్, అహేలా బేగం, సయ్యద్ నీలోఫర్, ఫిర్దౌస్ అంజుమ్, మహ్మద్ ఆరిఫ్, హీనా కౌసర్.. ఇలా మొత్తం 10 మందిని నిందితులుగా పేర్కొంటూ ఈడీ తన నివేదికను సిద్ధం చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న నయీం కుటుంబ సభ్యులకు ఈడీ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేసినా వారు విచారణకు హాజరు కాలేదని సమాచారం. అలాగే, వారి పేరుతో ఉన్న ఆస్తులకు సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయకపోవడంపై అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. దర్యాప్తుకు సహకరించని పక్షంలో నిందితులపై నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలని కూడా ఈడీ కోర్టును కోరే అవకాశం ఉంది.
పొలిటికల్, పోలీస్ బాస్‌ల గుండెల్లో రైళ్లు
నయీం సామ్రాజ్యం విస్తరించడంలో కొందరు రాజకీయ నాయకులు, పోలీస్ అధికారుల హస్తం ఉందనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. ఈ క్రమంలో నయీం జరిపిన భారీ ఆర్థిక లావాదేవీలు ఎక్కడికి వెళ్లాయి? అక్రమ సొమ్ములో వాటాలు అందుకున్న ఆ పెద్దలు ఎవరు? అనే కోణంలో ఈడీ ఫోకస్ పెట్టింది. కోర్టు చార్జీషీట్‌ను స్వీకరించిన నేపథ్యంలో, నిందితులకు నోటీసులు జారీ చేసి, వారిని విచారించే క్రమంలో మరికొన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 2016 ఆగస్టులో షాద్‌నగర్ వద్ద జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్‌లో నయీం మరణించిన తర్వాతే అతడి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి.
బాధితులు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేయడంతో అప్పటి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి 250కి పైగా కేసులు నమోదు చేసింది. అయితే, కోట్లాది రూపాయల హవాలా సొమ్ము, అక్రమ ఆస్తుల వ్యవహారం కావడంతో రంగంలోకి దిగిన ఈడీ, మనీలాండరింగ్ చట్టం కింద దర్యాప్తును ముమ్మరం చేసింది. తాజా చార్జీషీట్‌తో ఈ కేసు తుది దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది.