27-12-2025 03:30:49 PM
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఛార్జిషీట్ దాఖలు
హైదరాబాద్: సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట(Sandhya Theater stampede case) కేసులో పోలీసులు 23 మందిపై చార్జిషీట్ దాఖలు చేశారు. నటుడు అల్లు అర్జున్, థియేటర్ యజమానులు, ఎనిమిది మంది బౌన్సర్లు సహా మిగిలిన వారిపై కూడా అభియోగాలు మోపారు. గతేడాది డిసెంబర్‌లో పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో 39 ఏళ్ల మహిళ మరణించిన ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌తో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు.
2024 డిసెంబర్ 4న అల్లు అర్జున్ ఇతర కళాకారులతో కలిసి సంధ్య థియేటర్‌లో(Sandhya Theater) పుష్ప-2 ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యారు. బాధితురాలు ఎం. రేవతి తన భర్త, పిల్లలతో కలిసి ఈ ప్రీమియర్‌కు వచ్చింది. నటుడిని చూడగానే జనం ఉన్మాదానికి లోనయ్యారు. ఇది థియేటర్‌లో తొక్కిసలాటకు దారితీసింది. ఈ తొక్కిసలాటలో ఆ మహిళ మరణించగా, ఆమె కుమారుడు గాయపడి చికిత్స పొందుతున్నాడు. చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌పై(Allu Arjun), థియేటర్ యాజమాన్యం, నటుడితో పాటు థియేటర్‌కు వచ్చిన బౌన్సర్లపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత నటుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న 23 మంది నిందితులపై ఈ వారం ప్రారంభంలో సంబంధిత కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశామని హైదరాబాద్‌కు చెందిన ఒక అధికారి తెలిపారు. సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు నిర్ధారించారు.