04-12-2025 12:00:00 AM
మోతె, డిసెంబర్ 3 : ఆరుగాలం కష్టపడి పంటను పండించిన రైతన్నకు వెన్నుదన్నుగా నిలబడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ధాన్యం అమ్మకాల్లో వాళ్లకు ఏ విధమైన ఇబ్బందులు ఉండకూడదనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటిని సజావుగా నిర్వహించమని పి ఎస్ సి ఎస్ లకు, మహిళా సంఘాలకు అప్పజెప్పితే కొందరి స్వార్ధ పూరిత ఆలోచనలు, అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నీరు కారిపోతుంది.
దీనిలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్న పి ఎస్ సి ఎస్ వాళ్లే స్వార్థపూరిత ఆలోచనతో అక్రమార్జనకు తెరలేపడంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. సరిగ్గా ఇదే విధానం మండల పరిధిలోని సర్వారం ప్రాథమిక కేంద్రానికి మంజూరు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే జరుగుతుంది.
సర్వారంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇప్పటికే వెయ్యి టన్నుల ధాన్యం అమ్మగా వాళ్లు మాత్రం బస్తా తో కలిపి 40 కేజీల 700 గ్రాములు తీయాల్సి ఉండగా ఎక్కువ తూకం వేస్తూ రైతులను నిలువు దోపిడి చేస్తున్నారు. ఒక్కో బస్తాకు 42.5 నుంచి 43 కేజీల వరకు కాంట వేస్తున్నట్లు రైతులే చెబుతున్నారు. ఇలా ఎక్కువ తూకాలు వేసి వారిని అడ్డదిడ్డంగా దోచుకుంటున్నట్లు రైతులే చెబుతున్నారు.
ప్రారంభం నుంచి దోపిడి
విత్తనాలు కొనుగోలు దగ్గర నుంచి చేతికొచ్చిన పంటను అమ్ముకునేటప్పుడు కూడా రైతులను దళారులు మోసం చేస్తూనే వస్తున్నారు. విత్తనాల కొనుగోలులో విత్తనాల తయారీదారుడు, కలుపు మందు, పురుగుల మందు లో ఎరువుల దుకాణదారుడు, చివరకు అమ్ముకునే దశలో దళారులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వాళ్లు ప్రతిదశలోనూ రైతు దోపిడీకి గురి అవుతూనే ఉన్నాడు.
ధాన్యం అమ్మకాల్లో అధికారుల పర్యవేక్షణ కొరవడడం, దాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు సక్రమంగా చేయకపో వడం, సకాలంలో కాంట వేయకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే అమ్మవలసిన ధాన్యాన్ని రోజులు, నెలల తరబడి అక్కడే నిల్వ ఉంచడం వల్ల రైతులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఇదిలా ఉండగా ఒకపక్క ధాన్యాన్ని అమ్మాలనే ఆలోచనతో పాటు మరోపక్క యాసంగి నాటు తరుణం మించి పోతుందన్న ఆందోళనలో రైతు ఎంతకైనా అమ్మడానికి ఎంత ఎక్కువ వేసుకున్న ఏమనలేని నిశ్చలస్థితిలో నిలిచిపోతున్నాడు.
గట్టిగా అడిగితే మరిన్ని రోజులు ఇప్పుడే కాదు తరువాత వేస్తామని పక్కకు పెడితే మరింత నిరీక్షించాల్సి వస్తుందని రైతు తప్పని పరిస్థితుల్లో అమ్ముకోవాల్సి వస్తుందని పలువు రైతులు చెబుతున్నారు. ఎంత నష్టం వచ్చినా పక్క వాళ్లకు కూడా చెప్పుకోలేనంత దారుణమైన స్థితిలో రైతు దిగజారుతున్నాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంత జరుగుతున్న అధికారులు కూడా రైతుల పరిస్థితిని చక్కదిద్దేటటువంటి ఆలోచన చేయకపోవడం లక్షల డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.
మామూళ్ల మత్తుతో రైతులు చిత్తు
ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అధికారులకు మామూలు షరామాములే కావడంతో అధికారులు కూడా ఏమీ అనని పరిస్థితి నెలకొందని రైతులు బాహటంగానే చర్చించుకుంటున్నారు. ఆ మత్తు ఫలితంగానే రైతులు చిత్తు అవుతున్నారంటూ తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రైతుల యొక్క దినస్థితిని అధికారులు అర్థం చేసుకొని నిర్వాహకుల పైన తగినంత ఒత్తిడి తీసుకొచ్చి తూకాల్లో తేడా లేకుండా, సకాలంలో డబ్బులు చెల్లిస్తూ రైతులకు ఏ విధమైన ఇబ్బందులు కలక్కుండా పరిస్థితిని చక్కదిద్దాలని పలువురు కోరుతున్నారు.
రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధిక తూకాలు వేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కేజీల కొద్ది అదనపు తూకం వేస్తే ఒప్పో రైతు వేల రూపాయల్లో నష్టపోవాల్సి వస్తుంది. కావున అధికారులు నిరంతర పర్యవేక్షణలు చేస్తూ అధిక తూకాలు వేసే నిర్వాహకులపై తగు చర్యలు తీసుకోవాలి. రైతులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అధికారులు పర్యవేక్షణలు చేయాలి.
- బాలాజీ నాయక్, రైతు, రాంపురం తండా