calender_icon.png 22 October, 2025 | 10:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఉపాధి’లో అక్రమాలకు చెక్..!

22-10-2025 12:00:00 AM

  1. నూతన సాంకేతికతతో ‘ఉపాధి’లో అవకతవకల కట్టడికి చర్యలు
  2. ప్రతి కూలీకి ఈ కేవైసీ తప్పనిసరి
  3. ఈ నెల 31 వరకు చివరి గడువు

మెదక్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): ప్రభుత్వాలు ఉపాధి హామీలో నిబంధనలు ఎప్పటికప్పుడు మారుస్తున్నా అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఆక్రమాల నివారణ కోసం పనుల వివరాలను ప్రత్యేక యాప్లో నిక్షిప్తం చేసేలా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కూలీల జాబ్ కార్డులకు ఆధార్ అనుసంధానం ప్రక్రియ పూర్తి చేశారు.

అయినప్పటికీ హాజ రు వేస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలతో ఈ కేవైసీ        ప్రక్రియ ప్రారంభించారు. జిల్లాలో లక్షల మంది కూలీలుండగా కేవలం 40 శాతం మాత్రమే ఈకేవైసీ నమోదు చేయగా ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ ప్రక్రియను గ్రామాల్లో ఫీల్‌అసిస్టెంట్లు ముమ్మరం చేశారు. 

ఆన్లైన్లో హాజరు..

ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు కలిగిన క్రియాశీల కూలీల ఈ కేవైసీని ఫీల్ అసిస్టెంట్లు తమ ఫోన్లోని ప్రత్యేక యాప్ ద్వారా నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తి చేసుకుంటేనే ఉపాధిహామీ పనుల్లో హాజరు నమోదవుతుంది. గ్రామాల్లో నిర్దేశించిన పని ప్రదేశానికి కూలీ రాగానే ఫీల్ అసిస్టెంట్ ఫోన్లో ఈకేవైసీ చేసిన అనంతరం తిరిగి పనులు పూర్తిచేసి ఇంటికి వెళ్తున్న సమయంలో మరోసారి ఫొటో తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

రెండుసార్లు ఫొటో తీసినా సరిగ్గా నమోదయితేనే కూలీల ఖాతాల్లో వేతనం జమ అవుతుంది. దీంతో ఈ కేవైసీలో భాగంగా యాప్లో ముందుగా నమోదైన ఫొటో కూలీ పనికి వస్తేనే ఆన్లైన్లో హాజరు నమోదవుతుంది. దీంతో బినామీ హాజరుకు చెక్ పడుతుంది. ప్రత్యేక యాప్ ద్వారా పని ప్రదేశం నుంచే పనుల వివరాలను యాప్లో నమోదు చేస్తుండడంతో అవకతవకలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. 

31 వరకు నమోదు చేసుకోవాలి..

జాతీయ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలు ఈనెల 31లోపు ఈ కేవైసీ నమోదు చేసుకోవాలి. ఇప్పటి వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ కేవైసీ నమోదు చాలా తక్కవుగా ఉంది. ఆయా మండలాల్లో ఏపీఓవలపై నమోదును వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు.

ఉపాధి కూలీలకు గ్రామాల్లో గడువులోపు ఈ కేవైసీ నమోదు చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. ఉపాధి కూలీల హాజరులో ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా పారదర్శకత కోసం ఈ కేవైసీ చేయించడం ఎంతో ప్రయోజనకరంగాఉంటుంది.