22 June, 2026 | 10:24 AM

ట్రాన్స్‌జెండర్ రిజర్వేషన్లు పరిశీలించండి

21-07-2024 12:11 AM

టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): కార్మికశాఖలో పోస్టుల భర్తీకి ఆ శాఖ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టే నియామకాల్లో చట్ట ప్రకారం కుల రిజర్వేషన్లతోపాటు ట్రాన్స్ జెండర్ల రిజర్వేషన్ల అమలు గురించి పరిశీలన చేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. థర్డ్ జెండర్ క్యాటగిరీకి రిజర్వేషన్లు కల్పించని తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ నిబంధనల్లోని సెక్షన్ 22ను సవాల్ చేస్తూ బీ ఏడుకొండలు అనే ట్రాన్స్ జెండర్ హైకోర్టులో వ్యాజ్యాన్ని వేశారు. దీనిని జస్టిస్ పీ సుజయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావుతో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల విచారించింది. టీజీపీఎస్సీ, కార్మికశాఖ చేపడుతున్న నియామకాల్లో థర్డ్ జెండర్లకు రిజర్వేషన్ కల్పించకపోవడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని పిటిషనర్ లాయర్ కోరారు.

జాతీయ న్యాయసేవాధికార సంస్థ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలన్న ఇదే హైకోర్టు తీర్పును కూడా అమలు చేయడం లేదని తెలిపారు. కులం ఆధారంగా సమాంతర రిజర్వేషన్లను కల్పిస్తున్నారని, థర్డ్ జెండర్ రిజర్వేషన్లను అమలు చేయడం లేద చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు, ఉద్యోగ నోటిఫికేషన్‌లో కుల రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ట్రాన్స్ జెండర్ రిజర్వేషన్ కింద పిటిషనర్ అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకునే అంశాన్ని పరిశీలించాని కోర్టు సూచించింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు ఇచ్చి విచారణను వాయిదా వేసింది.