20 April, 2026 | 5:39 AM

ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో చిరుత సంచారం

29-04-2024 12:18 AM

రాజేంద్రనగర్, ఏప్రిల్ 28 (విజయ క్రాంతి): శంషాబాద్ విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం స్థానికంగా కలకలం రేపుతుంది. ఆదివారం తెల్లవారుజామున విమానాశ్రయం రన్‌వేపై చిరుత సంచరిస్తున్నట్లు పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించినట్లు తెలుస్తుంది. చిరుతతో పాటు మరో రెండు చిరుత పిల్లలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు అందించారు. వివరాల ప్రకారం.. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద ఎయిర్‌పోర్టు ప్రహారీగోడ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగిలింది. దీంతో ఎయిర్‌పోర్ట్ కంట్రోల్ రూంలో అలారం మోగింది. వెంటనే అప్రమత్తమైన కంట్రోల్ రూం సిబ్బంది సీసీ కెమెరాలను పరిశీలించి చిరుత సంచరించినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న వన్యప్రాణి విభాగం సిబ్బంది, జూ అధికారులు చిరుత కోసం పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. చిరుతను బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో గతంలోనూ చిరుత సంచరించిన దాఖలాలు ఉన్నాయి.