సాహస బాలుడికి సీఎం సత్కారం
సాయిచరణ్‌ను అభినందించిన రేవంత్
హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయ క్రాంతి)/షాద్‌నగర్: అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న ఆరు మందిని కాపాడటంలో 15 ఏళ్లు సాయిచరణ్ చూపిన సాహసాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశంసించారు. ఆయన నివాసంలో ఆ బాలున్ని ఘనంగా సన్మానించారు. రంగారెడ్డి జిల్లా నందిగామలోని అల్లెన్ పరిశ్రమలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో దట్టమైన మంటల మధ్య ఆరుగురు ఉద్యోగులు చిక్కుకోగా.. సాయిచరణ్ వారిని కాపాడటం కోసం ధైర్యంగా పరిశ్రమ భవనం పైకి వెళ్లి తాడు కట్టి ఉద్యోగులను కిందకి దించాడు. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న సీఎం ఆదివారం సాయిచరణ్‌తో పాటు అతని తల్లితండ్రులను ఇంటికి పిలిపించుకుని ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా సాయిచరణ్‌కు శాలువా కప్పి సీఎం ఘనంగా సన్మానించారు. చిన్న వాడివైనా ఒకరికి సాయం చేయాలనే ఆలోచన చాలా గొప్పదని, ఉన్నత చదువులు చదివి బంగారు భవిష్యత్ పొందాలని ఆకాంక్షించారు. అంతేగాక బాలుడి తల్లితండ్రులు రేణుక, వెంకటేశ్‌లను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, నందిగామ మండలానికి చెందిన ఎంపీటీసీ కొమ్ము కృష్ణ, కుమార స్వామి గౌడ్, చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు.






