ప్రేక్షకుల ఆదరణ వల్లే చెన్నై లవ్‌స్టోరీకి 50 కోట్లు
కొబ్బరిమట్ట, హృదయకాలేయం, కలర్ ఫొటో, బేబి వంటి చిత్రాలతో స్టోరీ రైటర్‌గా, డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు సాయి రాజేశ్. ఆయన కథను అందించి, నిర్మాత ఎస్‌కేఎన్‌తో కలిసి నిర్మించిన తాజాచిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రేక్షకాదరణతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లను దాటి రెండో వారంలోనూ థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.
ఈ నేపథ్యంలో గురువారం సాయిరాజేశ్ విలేకరులతో సమావేశారు. “చెన్నై లవ్ స్టోరీ సినిమాకు మొదటి రెండు రోజులు సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం జరిగింది. నిజంగా ప్రేక్షకులు వాకౌట్ చేస్తే 50 కోట్ల రూపాయల వసూళ్లు దక్కవు కదా. కలెక్షన్స్ నుంచి ప్రొడ్యూసర్స్‌కు డబ్బులు రావాలంటే కొంత టైమ్ పడుతుంది. ప్రస్తుతానికి పేపర్స్‌పైన లెక్కలను చూస్తే మేము లాభాల్లోనే ఉన్నాం.
మా సినిమా విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మెగాస్టార్ చిరంజీవి నాకు మెసేజ్ పంపారు. మరోసారి 50 కోట్ల గ్రాసర్ మూవీ చేశారని అభినందించారు. దర్శకుల సంఘం, ఫిలిం ఫెడరేషన్ పదవులన్నీ బాధ్యతగా భావిస్తున్నా. కనీస వేతనాల విషయంలో ప్రొడ్యూసర్స్ నుంచి ఒప్పందాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నాను కాబట్టి కార్మికుల పక్షాన్నే పనిచేస్తా” అన్నారు.






