24-08-2024 12:00:00 AM
అందరికీ అందుబాటులో, అన్ని సమయాల్లో చవకగా దొరికేది బాయిలర్ కోడి చికెన్. కానీ, నేడు ప్రతి చికెన్ సెంటర్లలో దర్శనమిస్తూ వున్నాయి నాటుకోళ్ళు. ధర కాస్త ఎక్కువైన లొట్టలు వేసుకుని తినే ఆహారం నాటుకోడి. ఈ కోడిగుడ్లు చిన్నగా వున్నా రుచి మాత్రం చెప్పలేనిది. పల్లెలు, పట్టణాల్లో కూడా నాటుకోడి అంటే ఇష్టపడే వారి సంఖ్య రోజరోజుకూ పెరిగిపోతున్నది. ఆదివారాలు, పండుగలు, సెలవు దినాలు, బర్త్‌డేలు, ఇయర్ ఎండింగ్ పార్టీలు ఏవైనా సరే అందరికీ ఇప్పుడు ముందుగా నాటుకోడే గుర్తుకు వస్తున్నది.
డిమాండ్‌కు తగ్గట్టుగా మార్కెట్లోనూ నాటుకోళ్ల సరఫరా పెరుగుతున్నది. గ్రామీణ ప్రాంతాల నుంచి చాలామంది పట్టణాలకు వీటిని తెచ్చి అమ్మతున్నారు. కొన్నిచోట్ల హైవేలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, ఫోన్ చేస్తే చాలు ఆర్డర్ తీసుకుని తెచ్చి ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాలలో రోడ్ల వెంట వీటి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి, జోరుగా అమ్మకాలు జరుపుతున్నారు. కోళ్ల ఫారాల వద్దనే కాంటాలు ఏర్పాటు చేసి తూకం వేస్తున్నారు. వీలైతే అక్కడే వండుకునేందుకు సైతం సిద్ధంగా ఉండేలా చికెన్ కొట్టి ఇస్తున్నారు.
నాటు కోడి కిలోకు రూ. 350 నుంచి రూ. 500 వరకు విక్రయిస్తున్నారు. అనేక సెంటర్లలో మాంసం ప్రియులు బారులు తీరుతున్నారు. ఉన్నత చదువులు చదివినా వారే వీటిని పెంచుతూ ఉపాధి పొందుతున్న వారు కూడా వున్నారు. ఒక్కో కోడిపిల్ల ధర సుమారుగా రూ.30 నుంచి రూ.45 మధ్య ఉంటుంది. సీడ్‌నుబట్టి ధరలో మార్పు ఉంటుంది. ఒక కోడి పిల్లలు సుమారు మూడు నెలల వరకు 2 నుంచి 3 కిలోల బరువు వస్తుంది. కోడి మార్కెట్లో విక్రయించే వరకు తగిన జాగ్రత్తలు పాటించాలి.
కోడి బరువు పెరిగే కొద్ది దానా ఎక్కువగా వేయాల్సి ఉంటుంది. ఎక్కువగా మొక్కజొన్న దానాను రైతులు వినియోగిస్తున్నారు. నాటు కోడి పరిశ్రమని అభివృద్ది చెయడానికి మన వంతుగా కృషి చేయాలి. దీనిని ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యదాయకమని నిపుణులూ సలహా ఇస్తున్నారు. ప్రతి గ్రామంలో యువత, మహిళలు, రైతులు వీటిని పెంచడానికి ముందుకు రావాలి. వీటి ప్రయోజనాలు అందరికీ తెలియ జెప్పడం ద్వారా ఉపాధి కోరుకునే వారి ఆదాయాన్ని పెంచవచ్చు.
కామిడి సతీష్ రెడ్డి