21-09-2025 07:43:16 PM
50 వేల నగదు అందజేసిన 1998-99 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు..
ఆర్మూర్ (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తూ విధి నిర్వహణలో అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందిన బాల్య మిత్రుడి కుటుంబానికి పూర్వపు బాల్య మిత్రులు బాసటగా నిలిచారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిదిలోని పెర్కిట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1998-99 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన ఇరగనేని ధనుంజయ్ ఈ నెల 11న మృతి చెందాడు. అతని కుటుంబానికి బాసటగా ఉండేందుకు ఆదివారం ధనుంజయ్ ఇంటికి వెళ్లి ఆతని సతీమణి శ్రీలతకు తోటి పూర్వ స్నేహితుల బృందం తలా కొంత నగదును జమ చేసి 59వేల నగదును అందజేసి ఆ కుటుంబానికి బాసటగా నిలిచారు.
అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు క్వింటాల్ బియ్యాన్ని పూర్వ విద్యార్థులు అందజేశారు. తోటి పూర్వ విద్యార్థులు తలా కొంత జమ చేసి మృతి చెందిన బాల్యమిత్రుడి కుటుంబానికి అందజేసి ఆ డబ్బులను వారి పాప వేద గాయత్రి పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వాడుకోవాలని ఆ కుటుంబ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బాల్య పూర్వపు మిత్రులు ఇట్టేడి మోహన్ రెడ్డి, మూడ అశోక్, రాస భూమేశ్వర్, వేల్పుల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.