పిల్లల పార్కులు.. ప్రేమికుల అడ్డాగా..?
*‘అమ్మా... వాళ్లు ఎవరూ?‘ అంటూ చిన్నారుల ప్రశ్నలు
*కుటుంబాలతో వచ్చే వారికి అసౌకర్యం ...
*పర్యవేక్షణ పెంచాలని స్థానికుల విజ్ఞప్తి
వనపర్తి, ఆగస్టు 6 (విజయక్రాంతి): ప్రజల ఆరోగ్యం, పిల్లల ఆటపాటలు, వృద్ధుల విశ్రాంతి కోసం ప్రభుత్వం అభివృద్ధి చేసిన పార్కులు కొన్నిచోట్ల అసలు లక్ష్యానికి భిన్నంగా ఉపయోగించబడుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డు ప్రభుత్వ వైద్యశాల వెనుక ఉన్న పార్కులో సాయంత్రం వేళల్లో కుటుంబాలతో వచ్చే వారికి అసౌకర్యం కలుగుతోందని కాలనీవాసులు చెబుతున్నారు.
స్థానికుల కథనం ప్రకారం, పార్కులో పిల్లలు ఆడుకుంటున్న సమయంలో కొంతమంది యువజంటలు కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ అభ్యంతరకరంగా కనిపించే రీతిలో వ్యవహరిస్తున్నారని అంటున్నారు. దీనిని గమనించిన చిన్నారులు ‘అమ్మా... వాళ్లు ఎవరూ?‘, ‘అలా ఎందుకు కూర్చున్నారు?‘ అంటూ అమాయకంగా ప్రశ్నిస్తుండటంతో తల్లిదండ్రులు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రశ్నించిన వారితో వాగ్వాదాలు జరిగినట్లు, చిన్నచిన్న ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.
దీంతో కుటుంబాలతో పార్కుకు వెళ్లేందుకు కొందరు వెనుకంజ వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్కుల్లో పోలీసుల రెగ్యులర్ గస్తీ నిర్వహించాలని షీ టీమ్స్ తరచూ పర్యవేక్షణ చేపట్టాలని సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయాలని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి పార్కు నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని కుటుంబాలు, చిన్నారులు నిర్భయంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కాలనివాసులు ప్రశ్నిస్తున్నారు.
పార్కుల అసలు ఉద్దేశం ఇదే
పార్కులు ప్రజలు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడానికి, యోగా సాధనకు, పిల్లలు స్వేచ్ఛగా ఆడుకోవడానికి, చెట్లుమొక్కల మధ్య స్వచ్ఛమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి, వృద్ధులు కలుసుకుని కాలక్షేపం చేయడానికి ఏర్పాటు చేస్తారు. అలాంటి ప్రదేశాల్లో కుటుంబాలకు అసౌకర్యం కలిగే పరిస్థితులు ఉంటే వాటిని నివారించడం అధికారుల బాధ్యత అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
స్పందించాల్సిన సమయం ఇదే
ప్రజల కోసం నిర్మించిన పార్కులు మళ్లీ ప్రజలకే సురక్షితంగా, ఆహ్లాదకరంగా మారాలంటే మున్సిపల్ అధికారులు, పోలీసు శాఖ సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు ఎప్పుడు స్పందిస్తారన్నది ఇప్పుడు స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది.






