7 August, 2026 | 2:28 AM

క్షుద్రపూజలపై వివరణ ఇవ్వాలి

07-08-2026 01:48 AM
  1. హరీశ్‌రావు ఆ ఆలయాలకు ఎందుకెళ్లారు?   
  2. లీగల్ నోటీసులకు చట్టబద్ధంగానే సమాధానం 
  3. సీఎం రేవంత్‌రెడ్డితో గ్యాప్ లేదు 
  4. రోజూ ఇద్దరం మాట్లాడుకుంటాం
  5. పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్  

హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి) : క్షుద్ర పూజల అంశంపై మాజీ మంత్రి హరీశ్‌రావు వివరణ ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఆయన వెళ్లిన ఆలయాలు క్షుద్రపూజలకు ఫేమస్ అని,  అక్కడికి ఎందుకు వెళ్లారో సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘నేను హరీశ్‌రావును కించపరచ లేదు.

ఆయనపై తప్పుడు ప్రచారం చేయలేదని, అక్కడి ఆలయాలకు ఎందుకెళ్లారో చెప్పాలని మాత్రమే ప్రశ్నించినట్లు తెలిపారు. హరీశ్‌రావు లీగల్ నోటీసులకు భయపడమని,  చట్టబద్ధంగానే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రానికి ఎవరు శని, ఎవరు దరిద్రం అనేది ప్రజలు ఎన్నికల్లో తేల్చారని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో తనకు గ్యాప్ ఉందనే ప్రచారంలో వాస్తవం లేదని, ఇద్దరం రోజూ ఫోన్‌లో మాట్లాడుకుంటామని మహేష్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు.

ప్రభుత్వకార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమపథకాల వంటి ప్రాధాన్యత అంశలపై పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చర్చిస్తే, మంచి నిర్ణయాలు తీసుకోవచ్చని భావించామని, అంతేకానీ సీఎంతో నాకు గ్యాప్ ఉందని ప్రతిపక్షలు దుష్ప్రచారం చేయటం తగదన్నారు. దొంగచాటున ఫిర్యాదులు చేసుకునే సంస్కృతి కాంగ్రెస్‌లో లేదని, ఏవిషయమైనా ముఖాముఖి మాట్లాడుకుంటామని తెలిపారు.

కో ఆర్డినేషన్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి మధ్యలో కూర్చున్నట్టుగా ఫొటోల్లో ఉందని, దీన్ని కొందరు వక్రీకరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రొటోకాల్ ప్రకారం మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించారని తెలిపారు. బీజేపీ ఎంపీ అరవింద్ మాటలు నీటి మూటలని.. నా ముందు అరవింద్, బండి సంజయ్ పిల్లలు అని పేర్కొన్నారు.

నాయకత్వానికి ఎత్తు ముఖ్యం కాదని, కావాల్సింది సామర్థ్యమని పేర్కొన్నారు. ఎత్తు తక్కువ ఉన్నప్పటికీ లాల్ బహదూర్‌శాస్త్రి అత్యంత సమర్థంగా దేశాన్ని నడిపారని, నాయకుల ప్రతిభను శారీరక రూపురేఖలతో అంచనా వేయొద్దని హితవు పలికారు.    

విచార్ విభాగ్ పాత్ర కీలకం 

నెహ్రూ కాలం నుంచే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలు, సూత్రాలను బలోపేతం చేయడంలో పీసీసీ విచార్ విభాగ్ కీలక పాత్ర పోషిస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లో పీసీసీ విచార్ విభాగ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. లౌకికవాదం, సామాజిక సామరస్యం, రాజ్యాంగ పరిపాలన పట్ల కాంగ్రెస్ పార్టీ అంకితభావంతో ఉందన్నారు.

టీపీసీసీ విచార్ విభాగ్ చైర్మన్ శ్యాం మోహన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విచార్ విభాగ్ దశాబ్దాలుగా పోషిస్తున్న పాత్ర చారిత్రకమన్నారు. సమావేశంలో ఏఐసీసీ విచార్ విభాగ్ చైర్మన్ కెప్టెన్ ప్రవీణ్ దావర్, ఏఐసీసీ విచార్ విభాగ్ వైస్‌చైర్‌పర్సన్ పుష్పలత స్వామితో పాటు వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.