calender_icon.png 24 January, 2026 | 12:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిర్చి రైతులు కన్నెర్ర!

24-01-2026 12:00:00 AM

  1. ఖమ్మం మార్కెట్లో దారుణంగా పడిపోయిన ఎండు మిరప ధర

వ్యాపారులు సిండికేట్ అయ్యారంటూ ఆందోళన

మార్కెట్ కార్యాలయం ముట్టడి పోలీసుల రంగ ప్రవేశం

మార్కెట్ చైర్మన్ హామీతో ఆందోళన విరమించిన రైతులు

ఖమ్మం, జనవరి 23 (విజయక్రాంతి): రెండు రోజుల క్రితం మిర్చి ధర రూ.16 వేల నుంచి ఒక్కసారిగా రూ. 20వేలకు పెరిగింది. ధర పెరిగిందనే సంతోషం రైతుల ముఖాల్లో నిలిచింది అనుకునే లోపే, శుక్రవారం మిరప ధరలు భారీగా పడిపోయాయి. ఏకంగా రూ. 13వేల వరకు పడిపోవడంతో రైతన్నల కడుపు మండిపోయింది. వ్యాపారులు కావాలని చేస్తున్నారని ఆగ్రహం చెందారు. తమ కష్టాన్ని వ్యాపారులు  అపహాస్యం చేస్తున్నారని ఆందోళనకు దిగారు.  ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర ఒక్కసారిగా తగ్గడంతో రైతులు ఆందోళన బాట పట్టారు.

ఖరీదుదారులు ధర తగ్గించడంతో వారు మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా నిర్వహించారు. శుక్రవారం ఏసీ మిర్చి ధర రూ. 20,100 పెరిగిన కానీ ఖరీదుదారులు కేవలం 13 వేల నుండి 15000 ఖరీదు చేయడమేమని మార్కెట్ అధికారులను నిలదీశారు. అధికారులు ఎంత చెప్పినా వినకపోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసినప్పటికీ రైతులు ఆందోళన విరమించకపోవడం తో మార్కెట్ కమిటీ చైర్మన్ యర్రగర్ల హనుమంతరావు సంఘటన స్థలానికి చేరుకొని రైతులకు నచ్చ చెప్పారు.

దీంతో తప్పని పరిస్థితుల్లో మార్కెట్ అధికారులు, ఖరీదుదారులతో చైర్మన్  అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మార్కెట్ లో జరిగిన ఆందోళన పై చర్చించిన ఆయన ఖరీదు దారులకు, రైతు కు నష్టం జరిగే పని చేయొద్దని వారికి హితవు పలికారు. రాష్ట్రంలో ఎక్కడలేని ధర ఖమ్మం మార్కెట్లో పలకడంతో రైతుల ఆశతో తాము పండించిన పంటను మంచి రేటుకి అమ్ముకొని కష్టాలను తీర్చుకుందాం అంటే ఖరీదుదారులు తమ ఆశలపై నీళ్లు చల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సుమారు రెండు గంటల పాటు ఖరీదులు నిలిపివేసిన అనంతరం, చైర్మన్ హామీతో రైతులు ఆందోళన విరమించారు. అదేవిధంగా రైతులకు ఇబ్బంది కలగకుండా జెండా పాట అనుగుణంగా మిర్చి కొనుగోలు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఖరీదుదారులు మిర్చి కొనుగోలు విషయంలో రైతులకు నష్టం కలిగించేలా వ్యవహరించి వారిపై చర్యలు తీసుకుంటామని చైర్మన్ తెలిపారు. ఆయన హామీతో రైతులు ఆందోళన విరమించడంతో మార్కెట్ కొనుగోలు అమ్మకాలు యథావిధిగా సాగాయి.