హద్దు మీరుతున్న చైనా!
భారత్ సరిహద్దు మరోసారి విపత్కర పరిణామాలు చోటుచేసుకోవడం కలవరపెడుతున్నది. ముఖ్యంగా అరుణాచల్‌ప్రదేశ్‌లోని సరిహద్దు వెంబడి చైనా కార్యకలాపాలపై స్థానిక ప్రజలు, ప్రతిపక్షాలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. భారత భూభాగంలోకి చైనా చొరబడిందనే తీవ్రమైన ఆరోపణలు రావడంతో కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సి వచ్చింది. అయితే, చైనా చొరబడిందన్న ఆరోపణలను ఖండించిన కేంద్ర ప్రభుత్వం సరిహద్దుకు అవతల ఆ దేశం భారీ ఎత్తున నిర్మాణాలు చేపడుతున్న విషయాన్ని మాత్రం అంగీకరించడం గమనార్హం.
సరిహద్దు విషయంలో స్పష్టత లేని లాంగ్జు వంటి ప్రాంతాల్లో నిర్మాణాలు జరుగుతున్నట్టు కేంద్రం వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ, విపక్షాల ఆరోపణలు చైనా ఆక్రమణలపై అనుమానాలకు తావిస్తున్నాయి. వాస్తవానికి భారత్ సరిహద్దు వివాదం 1959 నుంచి కొనసాగుతున్నది. అరుణాచల్‌ప్రదేశ్ తమ ప్రాంతమని వితండవాదం చేస్తున్న చైనా ఎప్పటినుంచో దురాక్రమణకు ప్రయత్నిస్తూనే ఉన్నది. ఈ క్రమంలోనే 2020లో గల్వాన్ లోయ ప్రాంతంలో కయ్యానికి కాలు దువ్వింది.
నాటి నుంచి రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత సరిహద్దుల్లో సైనిక మోహరింపులతో పాటు మౌలిక వసతుల నిర్మాణానికి ఇరుదేశాలు ప్రాధాన్యమిస్తున్నాయి. అయితే, అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా దృష్టి కేంద్రీకరించడం కేవలం భూవివాదానికే పరిమితం కాదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఈశాన్య రాష్ట్రాలను భారత ప్రధాన భూభాగంతో అనుసంధానించే సిలిగురి మార్గంపై చైనా కన్నేసినట్టు ఆరోపణలు వస్తుండటం అత్యంత ఆందోళనకరం.
అదే సమయంలో పొరుగు దేశాల్లో చైనా ఆర్థిక, దౌత్య ప్రభావాన్ని విస్తరించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నది. చికెన్ నెక్‌గా పిలుచుకునే ఈ ప్రాంతం నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్‌లకు సమీపం లో ఉండటంతో ఇది వ్యూహాత్మకంగా అత్యంత కీలకంగా మారింది. చైనా దూకుడు పెంచిన ప్రస్తుత తరుణంలో భారత్ ముందున్న అసలు సవాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని సరిహద్దు రక్షణ మాత్రమే కాదు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, సిలిగురి కారిడార్ భద్రతతోపాటు నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్‌తో దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకోవడమూ ఇప్పుడు అత్యవసరం. పొరుగు దేశాల్లో చైనా ప్రాబల్యాన్ని నిలువరించేందుకు దీర్ఘకాలిక వ్యూహంతో భారత్ ముందుకుసాగాల్సిన అవసరం ఉంది. తద్వారా జాతీయ ప్రయోజనాలను సాధించడంతోపాటు చైనాకు కూడా చెక్ పెట్టవచ్చు.






