10-10-2025 07:12:52 PM
పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో శుక్రవారం సినీ ఫక్కీలో దొంగతనం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డికి నీ మెడలోని పుస్తెలుతాడు ఫొటో తీసి పంపిస్తే.. వెంటనే పింఛన్ డబ్బులు బ్యాంకులో నుంచి తీసుకోవచ్చని మాయ మాటలు చెప్పి అమాయకురాలైన వృద్ధురాలి మెడలోని పుస్తెలు తాడుతో దొంగ పరారయ్యాడు. బాధితురాలి కథనం ప్రకారం... మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి బుదారపు శంకరమ్మ అనే 70 యేళ్ల వృద్ధురాలు నడుచుకుంటూ వెళ్తుండగా, ఆమెకు ఎదురుగా వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి మాటల్లో దింపి తాను గ్రామ పంచాయతీ కార్యదర్శి అనీ మీకు 2 నెలల పింఛన్ రూ.4 వేలు వచ్చాయని నమ్మబలికాడు.
మీ గ్రామంలో మొత్తం 14 మందికి పింఛన్ డబ్బులు రాగా, సగం మందికి డబ్బులు ఇచ్చాననీ, నీకు వచ్చిన డబ్బులు కూడా ఇచ్చేందుకే వస్తున్నానని చెప్పాడు. నీ మెడలోని పుస్తెలుతాడు తీసి ఇస్తే ఫొటో తీసి సీఎం రేవంత్ రెడ్డికి పంపిస్తే 5 నిమిషాల్లో నీ సించన్ డబ్బులు బ్యాంకులో జమ చేస్తారని చెప్పడంతో ఆమె నమ్మి తన మెడలోని 3 తులాల బంగారు పుస్తెలుతాడు తీసి అతని చేతికి ఇచ్చింది.
దాంతో ఆగంతకుడు పుస్తెలుతాడుతో నిమిషాల్లోనే మాయమయ్యాడు. ఆ పుస్తెలు తాడు విలువ రూ.4.5 లక్షలు ఉంటుందనీ, జరిగిన సంఘటనపై బాధితురాలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. సంఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఓ దుకాణంలో గల సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఆ పుటేజి ఆధారంగా అగంతకుడిని పట్టుకొనేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.