10-10-2025 08:29:16 PM
మండల వైద్యాధికారి డాక్టర్ భూక్యా నగేష్ నాయక్
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మానసిక ప్రశాంతత కోసం వ్యాయామం, యోగ, మెడిటేషన్ వంటివి చాలా ముఖ్యమని మండల వైద్యాధికారి డాక్టర్ భూక్యా నగేష్ నాయక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రం అర్వపల్లిలోని పీహెచ్సీలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన రోగులకు,గర్భిణీలకు,బాలింతలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మానసిక ఒత్తిడి అనేది అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని, ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు, చెడు అలవాట్లకు గురికాకూడదని చెప్పారు. మానసిక ఒత్తిడికి గురయ్యే వారు ప్రభుత్వం నిర్వహించే 14416 కాల్ సెంటర్ కు ఫోన్ చేసి నిపుణులైన వైద్యులచే కౌన్సిలింగ్ పొంది సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ బిచ్చునాయక్, డాక్టర్ సౌజన్య, నర్సింగ్ ఆఫీసర్లు చొక్కయ్య, సునీత, మాధవి, అనుష, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.