10-10-2025 08:22:38 PM
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే అగ్రవర్ణాల కుట్ర
జీవో 9పై హైకోర్టు స్టే విధించినందుకు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున రాస్తారోకో
రిజర్వేషన్లపై పిటిషన్ వేసిన రెడ్డి జాగృతి దిష్టిబొమ్మ దహనం
రెడ్డి కులస్తులంతా బీసీ వ్యతిరేకులే
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భైరీ రవికృష్ణ గౌడ్
హనుమకొండ,(విజయక్రాంతి): ఓరుగల్లు జిల్లా ఒక్కసారి భగ్గుమన్నది. స్థానిక సంస్థల కోటాలో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ జారీ చేసిన జీవో 9 పై హైకోర్టు స్టే విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ నేతృత్వంలో భారీ సంఖ్యలో బీసీ లోకమంతా రోడ్లపైకి వచ్చి హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ కజంక్షన్ వద్ద రాస్తారోకో, ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం జీవో 9 కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు, హైకోర్టులను ఆశ్రయించిన రెడ్డి జాగృతి సంఘం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బైరీ రవికృష్ణ గౌడ్ బీసీ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడారు. స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచి ఇప్పటివరకు బీసీ రిజర్వేషన్లు పెంచిన ప్రతిసారి కింది నుంచి పై కోర్టుల వరకు వేదికగా చేసుకుని రిజర్వేషన్ వ్యతిరేకులు అడ్డుకుంటున్నారని, కోర్టులు కూడా బీసీలకు న్యాయం చేయడం లేదని ఆయన ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని రాష్ట్ర గవర్నర్ ఆమోదించి ఉంటే రాష్ట్ర హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై స్టే వచ్చే అవకాశం లేదన్నారు.
హైకోర్టులో జరిగిన వాదన సందర్భంగా అసెంబ్లీలో చేసిన చట్టానికి గవర్నర్ ఆమోదం ఉందా అని రాష్ట్ర హైకోర్టు పదే పదే ప్రశ్నించిందని, ఒకవేళ గవర్నర్ ఆమోదం కనుక బీసీ రిజర్వేషన్లకు ఉంటే రాష్ట్ర హైకోర్టులో స్టే వచ్చేది కాదన్నారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ పద్ధతి దక్కడానికి మొదటి నుండి బీసీ సమాజమంతా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ, బీసీ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ ఎందుకు బాధ్యత తీసుకోలేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై బిజెపి గల్లీలో మాట ఢిల్లీలో మాట వినిపిస్తూ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుందన్నారు.
బీసీ రిజర్వేషన్లను పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని బిజెపి నాయకులు పదేపదే బీసీ సమాజాన్ని తప్పుదోవ పట్టించారని, బిజెపి నేతలు రాష్ట్ర గవర్నర్ ను కలిసి ఉంటే గవర్నర్ సానుకూలంగా నిర్ణయం తీసుకునే వారన్నారు. బీసీల వ్యతిరేక వైఖరిని అవలంబిస్తూనే బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం సిగ్గుచేటన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. ఒక పార్టీపై ఇంకొక పార్టీ నిందలు వేసుకుంటూ బీసీలను బలి పశువులను చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టే అగ్రవర్ణాలు చేసిన కుట్రలన్నారు.
జీవో 9పై హైకోర్టు స్టే విధించినందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీలంతా రోడ్లపైకి వచ్చి భారీ ఎత్తున రాస్తారోకో ధర్నా, కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఈ సందర్భంగా రిజర్వేషన్లపై పిటిషన్ రెడ్డి జాగృతి సంఘం దిష్టిబొమ్మను బీసీ నాయకులు దగ్ధం చేశారు. బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ రెడ్డి కులస్తులంతా బీసీ వ్యతిరేకులేనని, బీసీ సమాజమంతా రెడ్డి కులస్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
బీసీ రిజర్వేషన్లపై రెడ్డి జాగృతి పిటిషన్లు ఆధర్మమని, బీసీ రిజర్వేషన్లు ధర్మమన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే రాష్ట్రపతి, గవర్నర్ ల వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులను అమలు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. లేని యెడల భారతీయ జనతా పార్టీని తెలంగాణలో నామరూపాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వంతో ఢిల్లీలో పోరాటం చేసి బీసీ రిజర్వేషన్లను సాధించేవరకు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించవద్దని కోరారు.