10-10-2025 10:14:38 PM
డాక్టర్ సంగని మల్లేశ్వర్ ,పాస్ రాష్ట్ర అధ్యక్షులు
కాకతీయ యూనివర్సిటీ,(విజయక్రాంతి): భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రజలందరికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందాలని ప్రవచించిన అత్యున్నత న్యాయ స్థానాల్లో నియమితులైన న్యాయమూర్తుల్లో సామాజిక న్యాయం కొరవడి అట్టడుగు వర్గాలకు న్యాయం జరగడంలేదని ఫూలే ఆశయ సాధన సమితి అధ్యక్షులు (పాస్) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంగాని మల్లేశ్వర్ అన్నారు. ఈ రోజు కాకతీయ విశ్వవిద్యాలయం, దూరవిద్య కేంద్రం ప్రాంగణంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నిలువెత్తు విగ్రహానికి పూలమాల వేసి 42శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని వినతిపత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా పాస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్ మాట్లాడుతూ... రాజ్యాంగంలోని 38(1)వ అధికరణ ప్రజలందరి సంక్షేమాన్ని కోరిందని, 78 సంవత్సరాలుగా సామాజిక న్యాయం అందని ద్రాక్షగానే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగంలోని 285 (ఏ) సవరించి తెచ్చిన జీవో నెం '9'పై రెండు రోజులు వాదోపవాదనలు విని కొన్ని వర్గాలు మాత్రమే దైవాంశ సంభూతులుగా వర్ణించి, 8 శాతం లేని అగ్రవర్ణాలకు అనుకూలంగా హైకోర్టు 'స్టే' ఇచ్చి బీసీలకు రాజ్యాధికారం దూరం చేసే ప్రయత్నం చేసిందన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తున్న రాజకీయ పార్టీలకు ప్రజాక్షేత్రంలో శిక్షించే రోజులు దగ్గరపడ్డాయని మండిపడ్డారు. ఇప్పటికైనా గవర్నర్ ను ఒప్పించే బాధ్యత బీజేపీ తీసుకోని, రిజర్వేషన్ల అమలుకు సహకరించాలని విజ్ణప్తి చేశారు.