10-10-2025 09:54:48 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లు 42 శాతం చేస్తూ రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపిన కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోవడం సిగ్గుచేటని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర గవర్నర్ చేత కూడా ఆమోదం పొందకుండా బిజెపి కేంద్ర ప్రభుత్వం అడ్డుకుందన్నారు.
రాష్ట్రంలో ఉన్న బిజెపి కేంద్ర మంత్రులు ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలి లేదా కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి 42% రిజర్వేషన్లు ప్రకటించ చేయాలి అన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10 శాతం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం ఇవ్వడానికి సిద్ధం కాకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర బిజెపి నాయకత్వం రాష్ట్రం నుండి ఉన్న కేంద్ర బిజెపి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని ఒప్పించాలని లేకపోతే ఈ రాష్ట్ర బీసీల అందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని లేకుండా చేస్తే తప్ప 42 శాతం రిజర్వేషన్లు బీసీలు సాధించుకునే పరిస్థితి లేదనేది అర్థమైందన్నారు. కచ్చితంగా 42 శాతం రిజర్వేషన్లు సాధించుకునే దిశగా బీసీలు రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేయాల్సిన పరిస్థితిని కేంద్ర బిజెపి ప్రభుత్వం కల్పించిందన్నారు. కాబట్టి పోరాటం ద్వారా బీసీ రిజర్వేషన్లు సాధించుకోవాల న్నారు. రెండవది కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు ద్వారా న్యాయపరమైన పద్ధతిలో కూడా బీసీ రిజర్వేషన్లు అమలు అయ్యేటట్లు చూడాలన్నారు.