calender_icon.png 11 October, 2025 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంచలనం రేపిన బీజేపీ నాయకుని ఆత్మహత్య..!

10-10-2025 08:38:39 PM

నీల్వాయి అటవీ ప్రాంతంలో ఘటన

కారకులైన కాంగ్రెస్ నాయకులు, ఎస్సైపై చర్యలు తీసుకోవాలని బాధితులు, గ్రామస్తుల ఆందోళన

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల బిజెపి అధ్యక్షులు ఏట మధుకర్ శుక్రవారం ఉదయం నీల్వాయి అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసులు పెట్టించడం వల్లే మనస్థాపానికి గురైన ఏట మధుకర్ ప్రాణాలు తీసుకున్నట్లు మృతుని కుటుంబం కన్నీరు మున్నీరైంది.

వేమనపల్లి బిజెపి పార్టీ మండల అధ్యక్షులుగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న మధుకర్ పలు సమస్యలపై అధికార పార్టీ నాయకులను నిలదీస్తున్నందుకే టార్గెట్ గా పెట్టుకొని ఒక మహిళతో నీల్వాయి పోలీస్ స్టేషన్ లోఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించినట్లు శుక్రవారం మధుకర్ ఆత్మహత్యకు పాల్పడిన అటవీ ప్రాంతంలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీల్వాయి పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు. మృతుడు ఏట మధుకర్ సోమవారం కూడా యూరియా పక్కదారిపై స్థానిక వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. ప్రజా సమస్యలపై బిజెపి పార్టీ తరఫున పోరాడుతున్న మధుకర్ పై స్థానిక కాంగ్రెస్ నాయకులు వారం రోజుల కిందట ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించడంతో కలత చెంది ఆత్మహత్యకు పాల్పడడం జిల్లా వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. 

నా చావుకు వీళ్లే కారణం..!

వేమనపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు రుద్రభట్ల సంతోష్, గాలి మధు, చింతకింది కమల వల్లనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. వీరు నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెట్టించి నా పరువు ప్రతిష్టలు దెబ్బతీశారు. నా చావుకు కారణమయ్యారు. నేను ఇలాంటి తప్పు చేయలేదు. అలాంటి క్యారెక్టర్ నాది కాదు. నా చావుకు కారణమైన వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నా కుటుంబానికి బిజెపి పార్టీ అండగా నిలవాలి. నా కుటుంబాన్ని కాపాడాలి. వేమనపల్లి మండల ప్రజలందరూ ఆలోచించాలి. నా చావుకు కారణమైన అగ్రవర్ణ పాలకులకు బుద్ధి చెప్పండి అంటూ ఆత్మహత్యకు పాల్పడిన ఏట మధుకర్ తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు.

ఎస్సైని సస్పెండ్ చేయాలని ఆందోళన

కాంగ్రెస్ నాయకులకు వంతపాడి ఏట మధుకర్ ఆత్మహత్యకు కారకుడైన నీల్వాయి ఎస్సై కోటేశ్వర్ ను వెంటనే విధుల నుంచి తొలగించాలని బాధితులు, గ్రామస్తులు సంఘటన స్థలంలో ఆందోళన చేపట్టారు. ఎస్సై కోటేశ్వర్ అట్రాసిటీ కేసు పెట్టి వేధించడం వల్లే మధుకర్ ఆత్మహత్య చేసుకున్నట్లు సంఘటన స్థలంలో చెన్నూరు రూరల్ సీఐ బన్సీలాల్ కు మొరపెట్టుకున్నారు. ఎస్సై కోటేశ్వర్ ను సస్పెండ్ చేసే వరకు ఊరుకునేది లేదని వారు భీష్మించారు.

ఈ సంఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సీఐ బన్సీలాల్ నీల్వాయి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. మధుకర్ తన సూసైడ్ నోట్ లో వెల్లడించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని బిజెపి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు. కాగా వేట మధుకర్ ది ఆత్మహత్య కాదని, ముమ్మాటికి హత్యే అనే అనుమానం కలుగుతుందని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. బతుకమ్మ పండుగ డీజేల వల్ల ఇబ్బందులు తలెత్తినట్లు ఎస్సైకి మధుకర్ పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల ప్రోత్బలంతో మధుకర్ పై అక్రమంగా అట్రాసిటీ కేసు పెట్టి మానసికంగా వేధించారని ఆరోపించారు.