calender_icon.png 25 January, 2026 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్కిళ్లు డబుల్.. సర్టిఫికెట్లకు ట్రబుల్!

25-01-2026 01:03:55 AM

  1. గ్రేటర్‌లో స్తంభించిన జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ
  2. నెల రోజులుగా టెక్నికల్ లాక్.. ఆఫీసుల చుట్టూ జనం ప్రదక్షిణలు
  3. 30 నుంచి 60 సర్కిళ్లుగా మారడమే అసలు సమస్య 
  4. సర్టిఫికెట్ల జారీ పునరుద్ధరణ తేదీపై ఇంకా రాని స్పష్టత
  5. కొత్త మెడికల్ ఆఫీసర్లకు రాని లాగిన్లు.. పేరుకుపోయిన 35 వేల దరఖాస్తులు
  6. పాస్‌పోర్ట్‌లు, వీసాలు, స్కూల్ అడ్మిషన్లపై తీవ్ర ప్రభావం

హైదరాబాద్, సిటీ బ్యూరో జనవరి 24 (విజయక్రాంతి): పరిపాలన సౌలభ్యం కోసం అంటూ చేపట్టిన సంస్కరణలు.. సామాన్యుడి పాలిట శాపంగా మారాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వ్యవస్థల ప్రక్షాళన పేరుతో చేసిన మార్పులు, జనన , మరణ ధ్రువీకరణ పత్రాల జారీని పూర్తిగా స్తంభింపజే శాయి. సర్కిళ్ల సంఖ్యను పెంచడం, అధికారుల బదిలీలు, సాంకేతిక లోపాలు వెరసి..

గత నెల రోజులుగా సర్టిఫికెట్ల జారీ ప్రక్రి య ఎక్కడికక్కడే నిలిచిపోయింది. అత్యవసర పనుల నిమిత్తం సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వేలాది మంది నగర వాసులు.. జీహెచ్‌ఎంసీ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది.

30 నుంచి 60కి.. కష్టాలు షురూ

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు గతంలో ఉన్న 30 సర్కిళ్లను 60 సర్కిళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. అయితే, భౌతికంగా సర్కిళ్ల విభజన జరిగినప్పటికీ, ఆన్‌లైన్ వ్యవస్థలో మాత్రం టెక్నికల్ మ్యాపింగ్  పూర్తిస్థాయిలో జరగలేదు.

పాత సర్కిల్ పరిధిలోని ప్రాంతాలు ఇప్పుడు కొత్త సర్కిళ్లలోకి మారడంతో, సర్వర్లు ఆ డేటాను స్వీకరించడంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యం గా కొత్తగా ఏర్పడిన సర్కిల్స్ పరిధిలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండటంతో నెల రోజులుగా సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ పూర్తిగా పడకేసింది

35 వేల దరఖాస్తులు పెండింగ్

సాధారణ రోజుల్లోనే బర్త్, డెత్ సర్టిఫికెట్ల కోసం రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాంటిది నెల రోజులుగా జారీ నిలిచిపోవడంతో పెండింగ్ దరఖాస్తుల సంఖ్య కొండలా పెరిగిపోయింది. జీహెచ్‌ఎంసీ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం దాదాపు 30 వేల నుంచి 35 వేల వరకు సర్టిఫికెట్లు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

పిల్లల స్కూల్ అడ్మిషన్లు, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్లు, ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు, ఆస్తి బదిలీల వంటి అత్యవసర పనుల కోసం సర్టిఫికెట్లు కావాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. మీసేవ కేంద్రాల వద్ద, సర్కిల్ ఆఫీసుల వద్ద జనం బారులుదీరుతున్నా, సిబ్బంది నుంచి సర్వర్ పని చేయడం లేదు, మ్యాపింగ్ అవ్వలేదు అనే సమాధానమే వస్తోంది. 

మెడికల్ ఆఫీసర్ల బదిలీలు ఓ కారణమే

మరోవైపు, కొత్త సర్కిళ్ల ఏర్పాటుతో పాటు మెడికల్ ఆఫీసర్ల  బదిలీలు కూడా ఈ జాప్యానికి ప్రధాన కారణమయ్యాయి. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను డిజిటల్ సంతకం ద్వారా జారీ చేసే అధికారం మెడికల్ ఆఫీసర్లకు ఉంటుంది. అయితే, పాత వారు బదిలీ కావడం, కొత్తగా వచ్చిన వారికి ఇంకా డిజిటల్ కీ, లాగిన్ యాక్సెస్ రాకపోవడంతో వారు సంతకాలు చేయలేని పరిస్థితి నెలకొంది.

టెక్నికల్ మ్యాపింగ్ సమస్య ఒకవైపు, అధికారుల లాగిన్ సమస్య మరోవైపు వెరసి.. మొత్తం వ్యవస్థను అస్తవ్యస్తం చేశాయి. ఎప్పుడు తెరుచుకుంటాయో.. మా నాన్న గారు చనిపోయి 20 రోజులైంది. ఇన్సూరెన్స్ కోసం డెత్ సర్టిఫికెట్ కావాలి. రోజూ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా.. ఇంకా సర్కిల్ మ్యాపింగ్ కాలేదంటున్నారు. ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదు అని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక బంధం సమస్యను పరిష్కరిస్తోందని అధికారులు చెబుతున్నప్పటికీ, అది ఎప్పుడు కొలిక్కి వస్తుందనే దానిపై స్పష్టత లేదు.