25-08-2025 07:47:32 PM
పనిభారం, టార్గెట్స్ తగ్గించాలి
సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫిక్స్డ్18 వేల వేతనం నిర్ణయించి అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ( సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాటికి వినతిపత్రం అందజేసి డిఎంహెచ్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా చేసి వినతిపత్రం అందజేశారు. తన పరిధిలోని సమస్యలు పరిష్కరిస్తానని డిఎంహెచ్ఓ హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్లతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కనీస వేతనాల చట్టం 1948 ప్రకారం కనీస వేతనం26 వేల ఇవ్వాల్సి ఉండగా 9,500/- పారితోషకాలు మాత్రమే ఇస్తూ ఆశాల శ్రమను ప్రభుత్వాలే దోపిడీ చేస్తున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా ఆశాలకు ఒకే జాబ్ చార్ట్ ఉండాలని, ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, ఎన్ హెచ్ ఎం స్కీము ను బలోపేతం చేయాలని అనేక ఉద్యమాలు ఆశాలు చేశారని తెలిపారు. జులై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో ఆశ వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొనడంతో భయపడిన ప్రభుత్వం పార్లమెంట్ లో1500-/పారితోషికాలు పెంచుతామని ఈ మాత్రం ప్రకటనైనా చేసిందని అన్నారు. పిక్స్డ్ వేతనం వచ్చేవరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.