ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీఐటీయూ ఆందోళన
మంచిర్యాల టౌన్, మార్చి 24 : ఆర్టీసీ ప్రైవేటికరణను నిరసిస్తూ మంగళవారం సీఐటీయూ నాయకులు టీజీ ఆర్టీసీ డిపో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసి బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చిందని, పెరిగిన ప్రజల అవసరాల మేరకు ఆర్టీసి బస్సులు, దానికనుగుణంగా కార్మికుల సంఖ్య పెరుగుతుందని, కొత్త ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎం.వి.యాక్ట్-2019, విద్యుత్ బస్సుల విధానం వల్ల ఆర్టీసిలో తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయన్నారు.
విద్యుత్ బస్ ల వల్ల ఆర్టీసిలు కనుమరుగై, ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలు మాత్రమే ఆర్టీసిలో మిగిలే పరిస్థితి వుంటుందని, ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్న అన్ని సబ్సిడీలను ఆర్టీసిలకు ఇవ్వాలని, .ఆర్టీసి నేరుగా విద్యుత్ బస్సులు సమకూర్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బడ్జెట్లో నిధులు కేటాయించి ఆర్టీసి బస్ ల ఆపరేషన్ ఖర్చుకు, ఆదాయానికి మధ్య వ్యత్యాసాన్ని (వయబిలిటీ గ్యాప్ ఫండ్)ను ఆర్టీసికి ఇవ్వాలని, విద్యుత్ బస్ బాడీ ఫ్యాబ్రికేషన్ ఆర్టీసి వర్క్ షాప్ లలో చేయించాలనీ, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసి ప్రజల అవసరాల మేరకు బస్సుల సంఖ్యను పెంచాలన్నారు. ఆర్టీసి కార్మికుల ఉద్యోగ భద్రత కల్పించాలనీ డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి దాసరి రాజేశ్వరి, జిల్లా కమిటీ సభ్యులు చల్లూరి దేవదాస్, గోమాస ప్రకాష్, నాయకులు రబియా, కుమారస్వామి, సంతోష్, సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




