టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలి
ఆదిలాబాద్, మార్చి 24 (విజయక్రాంతి) : టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కలవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్‘ 100 రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని,
స్పెషలిస్ట్ మెడికల్ క్యాంపును ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు టిబి వ్యాధిగ్రస్థులకు కళావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిక్షయ్ మిత్ర కిట్ లను, టిబి నియంత్రణకు కృషి చేసిన సర్పంచ్ లకు, ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు ప్రశంస పత్రాలను అందజేశారు. అనంతరం టిబి నియంత్రణ అవగాహన ప్రచార వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 24 గ్రామాలను ఇప్పటికే టీబీ రహిత గ్రామాలుగా ప్రకటించామని, ఇందులో రెండు ఏళ్లుగా టీబీ కేసులు లేని టక్కుగూడ గ్రామానికి ’సిల్వర్ మెడల్’ లభించిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు వైద్యాధికారులు సాధన, మనోహర్, టీబీ ప్రోగ్రామ్ అధికారి సుమలత, తహసిల్దార్ రమేష్, ఎంపీడీవో గోపాల కృష్ణ రెడ్డి, కళావతి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అశోక్, వైద్యులు, రోగులు, ఆయా సర్పంచ్లు రంజన, లక్మీ , కోమల్, లత పాల్గొన్నారు.




