calender_icon.png 3 August, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూల్స్ అతిక్రమిస్తున్న సివిల్స్ అధికారులు?

03-08-2025 12:51:30 AM

  1. డీఎస్ చౌహన్, హరిచందనలపై సీఎస్‌కు ఫిర్యాదు చేస్తం 

ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ 

హైదరాబాద్, ఆగష్టు 2 (విజయక్రాంతి): దురదృష్టవశాత్తు కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లు సర్వీస్ రూల్స్‌ను అతిక్రమిస్తూ సీఎం రేవంత్‌కు బానిసల్లా పనిచేస్తున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ఆరో పించారు. సర్వీస్ రూల్స్ ను ఉల్లంఘించిన ఐపీఎస్ దేవేంద్ర చౌహన్, ఐఏఎస్ హరిచందనలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యా దు చేస్తున్నామన్నారు.

శనివారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వారిద్దరు తక్షణమే క్షమాపణ చెప్పా లని డిమాండ్ చేశారు. ఖైరతాబాద్ నియోజకర్గంలో రేషన్ కార్డుల పంపిణీలో డీఎస్ చౌహన్, హరిచందన కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నట్టు మాట్లాడారని, రాజ్యాంగాన్ని అందరిముందే ఉల్లంఘించారని ఆరోపించారు. అధికారులై ఉండి వారిద్దరు బీఆర్ ఎస్ ప్రభుత్వంపై బురద జల్లేలా మాట్లాడారని, కేసీఆర్ ప్రభుత్వ హయంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని వారు అబద్దాలు మాట్లాడారన్నారు.

కేసీఆర్ హాయంలో 6 లక్షల 47 వేల రేషన్ కార్డులు ఇచ్చారని, రికార్డులు తెప్పించుకోకుండా వారు అబద్దాలు చదివారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రేషన్‌కార్డులను అమ్ముకునే దరిద్రం మొదలైందని, 2 లక్షల కార్డుల కోసం దరఖాస్తులు వస్తే యాభై వేలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఢిల్లీ వెళ్లి డీఓపీటీకి కూడా వారిద్దరిపై ఫిర్యాదు చేస్తున్నామని, పార్లమెంటులో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతామని ఆయన తెలిపారు.

కేసీఆర్ కడిగిన ముత్యం: జగదీశ్‌రెడ్డి

కాళేశ్వరం కమిషన్ విచారణలో కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకొస్తారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఏ కమిషన్ అయినా కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి నివేదికలు ఇవ్వలేవన్నారు. శనివారం  తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆ యన మాట్లాడుతూ కాళేశ్వరం కమిషన్ నివేదిక పేరు మీద ఇష్టమొచ్చిన రాతలు రాయి స్తున్నారని.. ఇవేవి నిజాలు కావని, కేవలం సీఎం ఆఫీస్ నుంచి వస్తున్న తప్పుడు లీకులు మాత్రమేనని ఆయన ఆరోపించారు.

తప్పుడు వార్తలు రాసేవారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయన్నారు. సీల్డ్ కవర్‌లో ఇచ్చిన నివేదిక ఎట్లా లీక్ అవుతుందని ప్రశ్నించారు. 50వ ఢిల్లీ పర్యటనలో రేవంత్‌రెడ్డి సాధించింది ఏంటో చెప్పాలని, తెలంగాణ ప్రజల జేబులు కొట్టి ఢిల్లీకి కప్పం కడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ఆర్థిక, పారిశ్రామిక, రియల్ ఎస్టేట్ రంగాలు కోమాలోకి వెళ్లాయని విమర్శించారు.

రేవంత్‌రెడ్డి ఢిల్లీకి ఎక్కే  ఫ్లుటై, దిగే ఫ్లుటైతో అర్థశతకం పూర్తి అయిందని, ఢిల్లీ నుంచి రాష్ట్రానికి 50 పైసలు తేలేదని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.5 లక్షల కోట్లు ఖర్చుచేసిందని, ఇందులో రూ. 2లక్షల కోట్ల అప్పు ఉందన్నారు.