19 April, 2026 | 4:40 PM

భూ వివాదంపై ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ

19-04-2026 03:22 PM

ఓ కుటుంబంపై మాజీ జెడ్పిటిసి కుటుంబ సభ్యులు దాడి చేశారని ఆరోపణ

పరస్పరం ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

వర్ని మండలం చింతల్ పేట గ్రామంలో చోటుచేసుకున్న ఘటన

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న వర్ని పోలీసులు

బాన్సువాడ,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా వర్ని మండలం చింతల్‌పేట్ గ్రామంలో భూవివాదం తీవ్ర ఉద్రిక్తత, ఘర్షణకు దారి తీసి రక్తపాతం చోటుచేసుకుంది. వర్ని మండలం చింతల్ పేట్ గ్రామానికి చెందిన ప్రేమ్ సింగ్ కుటుంబ సభ్యులపై, అదే గ్రామానికి చెందిన మాజీ జెడ్పిటిసి హరిదాస్ కుటుంబ సభ్యులు ఆదివారం దాడి చేశారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనలో ప్రేమ్ సింగ్‌కు తలపై గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

భూమి కొనుగోలు, అమ్మకాలలో డబ్బుల వ్యవహారం కారణంగా ఈ ఘర్షణ చోటుచేసుకున్నట్లు బాధితులు తెలిపారు. తమపై విచక్షణారహితంగా కర్రలు, కారం, ఇతర సామాగ్రి తో దాడి చేశారని, గత కొంతకాలంగా హరిదాస్ కుటుంబం నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నామని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై వర్ని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.ఇదిలా ఉండగా, మాజీ జెడ్పిటిసి హరిదాస్ బాధిత కుటుంబాల ఆరోపణలను ఖండిస్తూ, తాము ఎవరిపై దాడి చేయలేదని, ప్రేమ్ సింగ్ కుటుంబ సభ్యులే  తమపై దాడి చేశారని పేర్కొన్నారు. తాము కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

భూమి రిజిస్ట్రేషన్ విషయంలో సహకరించడం లేదని, డబ్బులు చెల్లించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ విషయంపై గ్రామ సర్పంచ్ స్పందిస్తూ భూమి అమ్మకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ విషయంలో సమస్యలు ఉన్నట్లు, డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వివాదం చెలరేగిందని తెలిపారు. వర్ని ఎస్సై మాట్లాడుతూ ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.