నేతకాని కులాన్ని గెజిట్ లో చేర్చకపోతే ఆందోళన తప్పదు
బెల్లంపల్లి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నేతకాని కులాన్ని ప్రభుత్వం గెజిట్ లో చేర్చాలని నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కలాలి నర్సయ్య, రాష్ట్ర కార్యదర్శి గోమాస రాజం, జిల్లా ఉపాధ్యక్షుడు చదువుల వెంకట రమణ, నేతకాని మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి ముడిమడుగుల గీతారాణి డిమాండ్ చేశారు. బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రంలో దాదాపు 15 లక్షల కు పైచిలుకు నేతకాని కులం జనాభా ఉందని, జన గణనలో ప్రభుత్వం సాలే, మాలే కులాలను చూపుతూ కేవలం లక్షా70 వేల జనాభా ఉన్నట్లు చూపడం సరికాదన్నారు. ఈ సమస్యపై రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన, వినతి పత్రాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోని మూడు లక్షల నేతకానిల జనాభా ఉందనే ఉద్దేశ్యంతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపల్లి పార్లమెంటు స్థానాన్ని నేతకానీలకు కేటాయించిందనీ గుర్తుచేసారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించాలన్నారు. నేతకాని జనాభా కనుగుణంగా నేతకాని కులాన్ని గజిట్లో చేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన తప్పదన్నారు. ఈ సమావేశంలో నాయకులు గోమాస జువ్వాజీ, గోమాస శ్రీనివాస్, దుర్గం భరత్, బెడ్డల మహేందర్, గోమాస వినోద్, గోమాస రాజేశ్వర్, చల్లూరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.






