19-10-2025 04:01:25 PM
హైదరాబాద్: లైసెన్స్ సర్వేయర్లుగా శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు పంపిణీ కార్యక్రమం హైదరాబాద్ లోని శిల్పకళ వేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... భూమి మీద ఆధిపత్యం కోసం గతంలో యుద్ధాలు జరిగాయని, కన్నతల్లిపై ఉన్న మమకారాన్నే తెలంగాణ ప్రజలు భూమిపై చూపించారు. సర్వేలో తప్పులు చేస్తే ప్రజలు మీ మీద తిరగబడే అవకాశం ఉందని, గత ప్రభుత్వం తెచ్చిన ధరణి చట్టం.. కొంతమంది దొరకు చుట్టంగా మారిందని సీఎం పేర్కొన్నారు. ధరణి చట్టాన్ని అడ్డుపెట్టుకొని భూమి మీద ఆధిపత్యం చెలాయించాలని చూశారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుకు అనేక కారణాలు ఉండొచ్చు.
కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఓటమికి ధరణి చట్టమే ప్రధాన కారణమని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి నుంచి విముక్తి కలిగిస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. మా ప్రభుత్వం రాగానే ధరణి చట్టాన్ని తొలగించి భూభారతి తెచ్చామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఒకవేళ పరీక్షలు పెట్టిన ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరకేవని ఆయన ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయంలో టీజీపీఎస్సీ పునరావాస కేంద్రంగా ఉండేదని సీఎం వ్యాఖ్యానించారు. మా ప్రభుత్వం రాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి వచ్చిన ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని వివరించారు. కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగాలు ఇస్తుంటే కోర్టుల్లో కేసులు వేసి ఆపాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడారు.
కోర్టుల్లో పోరాడి అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేశామని, త్వరలో గ్రూప్-3,4 అభ్యర్థులకు కూడా నియామక పత్రాలు అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా ప్రస్తుతం 5 శాతంగా ఉందని, త్వరలోనే 10 శాతానికి చేరేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఉద్యోగులు కష్టపడితేనే.. ప్రజల సమస్యలు పరిష్కారిస్తేనే.. ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందన్నారు.