10-10-2025 12:10:33 AM
మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి) : స్థానిక ఎన్నికలపై నెలకొన్న సందిగ్ధతకు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే కారణమని, రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే సీఎం రిజర్వేషన్ ల పేరిట మభ్యపెడుతు, బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అన్నారు.
గురువారం పార్టీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని హైకోర్టు జీఓ 9 పై ఇచ్చిన స్టే పై స్పందించారు. మ్యానిఫెస్టోలో పొందుపరిచే సమయంలోనే 42 శాతం రిజర్వేషన్ల పరిణామాల గురించి ముఖ్యమంత్రి కి పూర్తి అవగాహన ఉందని, రాజకీయంగా లబ్ధి పొందలన్న ఉద్దేశంతోనే బీసీలకు హామీలు ఇచ్చారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు.
22 నెలలుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాల్సిన రేవంత్ రెడ్డి గల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామా క్రియేట్ చేస్తున్నారే తప్ప బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సంపాదించడం పట్ల ఏనాడు చిత్తశుద్ధి కనిపించలేదు అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు యా సం నర్సింగరావు, గండ్రత్ రమేష్, మార్శెట్టి గోవర్ధన్, సేవ్వ జగదీష్ దాసరి రమేష్, శ్రీనివాస్, రాజన్న, ధర్మపాల్, బట్టు సతీష్, లక్ష్మణ్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.