calender_icon.png 11 October, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమలంలో భగ్గుమన్న వర్గ విభేదాలు

10-10-2025 12:09:44 AM

  1. రసాబసగా మారిన స్థానిక జిల్లా స్థాయి సమావేశం 

సీతారాం నాయక్ వర్సెస్ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మధ్య వాగ్వాదం.

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 9, ( విజయక్రాంతి):ఇంతకాలం స్తబ్దతగా ఉన్న కమలం పార్టీ వర్గ విభేదాలు గురువారం ఒకేసారి బగ్గుమన్నాయి. ఐకమత్యానికి మారుపేరుగా చెప్పుకొనే కమల నాధులు ఈ ఘటనతో అవాక్కయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్వంచలో ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి స్థానిక సంస్థల సమావేశం కాస్త రసాబసగా మారింది మారింది.

జిల్లా అధ్యక్షులు సమావేశం సమాచారాన్ని కేవలం తన వర్గీయులకు మాత్రమే తెలియపరచి నట్లు, సీనియర్ భాజపా నాయకులను విస్మరించారంటూ సీనియర్ బిజెపి నాయకులు సీతారాం నాయక్ వర్గంతో సహా, ఇతర జిల్లా స్థాయి నాయకులు మండిపడ్డారు. సమాచారం ఇవ్వకుండా సమావేశం నిర్వహించడాన్ని సీతారాం నాయక్ వర్గీయులు సమావేశాన్ని అడ్డుకోవటంతో ఇరువర్గాల మధ్య తీవ్రమైన వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుని ఘర్షణ వాతావరణం నెలకొంది.

పరిస్థితిని అదుపులోకి తేవడానికి మాజీ జిల్లా అధ్యక్షులు రంగా కిరణ్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ గందరగోళం తగ్గలేదు. దీంతో తీవ్ర ఉధృక్తత మధ్య జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమావేశం నుంచి వెళ్లిపోయారు.

సమావేశం మధ్యలో జిల్లా అధ్యక్షుడు వ్యవహరించిన తీరును సీతారాం నాయక్ వర్గీయులు పూర్తిగా తప్పుపట్టారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో ఏకపక్షంగా వ్యవహరించిన అధ్యక్షుని ధోరణిని రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ పరిణామం జిల్లా బిజెపిలో నాయకత్వ సంక్షోభాన్ని తేటతెల్లం చేసింది.