calender_icon.png 10 October, 2025 | 3:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్‌పై సీఎంకు చిత్తశుద్ధి లేదు

10-10-2025 12:26:08 AM

-బీసీలను ఆశల పల్లకిలో ఊరేగించిన కాంగ్రెస్

-కాంగ్రెస్ చేతకానితనాన్ని ఇతర పార్టీలపై బురదజల్లే ప్రయత్నం

-బీజేపీ శాసనసభ పక్ష ఉపనేత పాయల్ శంకర్ ధ్వజం

ఆదిలాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీకి 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు పట్ల చిత్తశుద్ధి లేదని, దీనికి తాజాగా హై కోర్టు స్టే ఇవ్వడమే నిదర్శనమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జీఓ 9 పై హైకోర్టు స్టే విధించడంపై స్పందించిన ఎమ్మెల్యే  గురువారం మీడియాతో మాట్లాడారు.... 42% బీసీ రిజర్వేషన్లపై ఆనాడే తాను అసెంబ్లీలో చర్చించడం జరిగిందని, రిజర్వేషన్ అమలులో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని అప్పుడే ప్రభుత్వానికి సూచించడం జరిగిందని గుర్తు చేశారు. బీసీ లను కాంగ్రెస్ మోసం చేస్తోందని అసెంబ్లీలో చెప్పానని, అదే ఇప్పుడు జరిగిందన్నారు.

బీసీ బిల్లుకు అసెంబ్లీలో బీజేపీ మద్దతు పలికి మద్దతు ఎన్నో సూచనలు చేశామని, అయిన పట్టించుకోకుండా ప్రభుత్వం ఈ విషయాని పెడచెవిన పెట్టిందని ధ్వజమెత్తారు. బీసీ రిజర్వేషన్ల పట్ల సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని, ఇలాంటి సమస్యలే మహారాష్ట్రలో, కర్ణాటకలో వచ్చిన ఉదాహరణలు సైతం తాను అసెంబ్లీ లో చెప్పడం జరిగిందన్నారు. 42 శాతం పేరిట కాంగ్రెస్ బీసీ లను ఆశల పల్లకిలో ఊరేగించిందని, ఏమీ కాకముందే కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకాలు చేసుకున్నారని ఎద్దేవా చేశారు.

గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్ లో ఉండగానే, జీవో జారీ చేయడమే రాష్ట్ర ప్రభుత్వం బీసీ లకు చేసిన కుటిల నీతి బైట పండిందన్నారు. రిజర్వేషన్ల పేరిట బీసీలను మోసం చేసి, రాజకీయ లబ్ధి పొం దాలని చూసిందని ధ్వజమెత్తారు.  కాంగ్రెస్ ప్రభుత్వం తన చేతగాని తనాన్ని ఇతర పార్టీలపై బురదజల్లే ప్రయత్నం చేసి, రాజకీయ పబ్బం గడుపుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో ఈ గందరగోళ పరిస్థితికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని అప్పటి వరకు బీసీల పక్షాన తాముండి పోరాడుతామని వెల్లడించారు.ఈ మీడియా సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.