calender_icon.png 10 October, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జడ్పీపై కాషాయ జెండా ఎగురవేస్తాం

10-10-2025 12:25:14 AM

  1. ఎంపీ అరవింద్ సవాల్ కాంగ్రెస్, బీజేపీ అమీ తుమీ లలితాస్త్రామే దిక్కా 
  2. కాంగ్రెస్‌లో మల్లగుల్లాలు బీజేపీని అడ్డుకునేలా ముందుకు ‘హస్తం’కు గెలుపు ప్రతిష్టాత్మకమే 

నిజామాబాద్ అక్టోబర్ 9 (విజయక్రాంతి) : నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మ న్ పీఠం, కేవలం ఒక స్థానిక సంస్థల పదవిగా కాకుండా, జిల్లా రాజకీయ భవిష్య త్తును నిర్దేశించే ఒక వ్యూహాత్మక కేంద్రంగా మారింది. బీసీ మహిళకు ఈ స్థానాన్ని రిజర్వ్ చేయడంతో, అధికార కాంగ్రెస్ పార్టీలో సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.

ఈ రాజకీయ చదరంగంలో, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పేరు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ, ఇది ఆమె రాజకీయ పునరాగమనాని కి సో పానమా లేక పార్టీలో కొత్త అంతర్గత సమీకరణాలకు నాంది పలుకు తుందా అన్నది ఉత్కంఠ రేపుతోంది. రోజు రోజుకి బలపడుతున్న బీజేపీ సవాల్ చేసే స్థాయికి ఎదిగింది. ఎంపీ అరవింద్ జడ్పీ చైర్మన్ పీఠంపై కాషాయ జెండా ఖాయమని సవాల్ చేశారు.

ఇది కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. అధికారంలో ఉండి, పీఠం గేలుచుకోకుంటే భవిష్యత్తులో జిల్లాలో పార్టీ పరిస్థితి ఏంటి అని పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. సాక్షాత్తూ టీపీసీసీ స్వంత జిల్లా కావడం, బీజేపీ ఎంపీ సవాల్ చేయడం రాజకీయ ఆసక్తిని పెంచుతోంది. ఒకరకంగా జడ్పీ పోరు ఎంపీ అర వింద్ వర్సెస్ కాంగ్రెస్ అనే స్థాయికి చేరింది. రాబోయే ఎన్నికపై హీట్ పెంచుతోంది.

వ్యూహాత్మక కూడలిలో కాంగ్రెస్..

అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినా, లోక్సభ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని బీజేపీకి కోల్పోవడం కాంగ్రెస్ పార్టీకి నిజామాబాద్లో ఒక హెచ్చరిక విసిరింది బిజెపి. ముఖ్యంగా, బీజేపీ ఎంపీ అరవింద్ విజయం వెనుక బీసీ ఓటు బ్యాంకు సమీకరణ కీలక పాత్ర పోషించిందన్నది బహిరంగ రహస్యం. ఎంపీ అరవింద్ సైతం ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. జడ్పీ చైర్మన్ పీఠంపై కాషాయం జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి సభలో జడ్పీ పీఠం తమదే అనటం ఆయనలోని బలమైన నమ్మక శక్తిని సూచిస్తోంది. ఇలాంటి సమయంలో  స్థానిక సంస్థల ఎన్నికలు, కాంగ్రెస్కు తమ బలాన్ని తిరిగి నిరూపించుకోవడానికి, ముఖ్యంగా బీజేపీ వైపు మొగ్గుచూపుతున్న బీసీ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఒక సువర్ణావకాశం.

ఈ నేపథ్యంలో, జడ్పీ చైర్మన్ అభ్యర్థి ఎంపిక కేవలం ఒక వ్యక్తికి పీఠం కట్టబెట్టడం కాదు, అది మొత్తం జిల్లాపై ఆధిపత్యం కోసం వేసే ఒక ఎత్తుగడ. బీసీవాదం బలంగా ఉన్న ఈ గడ్డపై, బలమైన బీసీ నేతను నిలబెట్టడం ద్వారా స్పష్టమైన సందేశం పంపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.

లలితనే అయితే..

ఈ క్లిష్టమైన సమీకరణంలో, ఆకుల లలిత అభ్యర్థిత్వం ఒక శక్తివంతమైన అస్త్రంగా కనిపిస్తోంది. రెండుసార్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పనిచేసిన పరిపాలనా ఆభవం, జిల్లా వ్యాప్తంగా వ్యక్తిగత గుర్తింపు, ఆర్థిక పరిపుష్టి ఆమెను ఇతరులకన్నా ముందు వరుసలో నిలుపుతున్నాయి. రాజకీయంగా, సంఖ్యాపరంగా బలమైన మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందినవారు కావడం అతిపెద్ద సానుకూలాంశం.

ఆమెను అభ్యర్థిగా ప్రకటిస్తే, ఆ సామాజికవర్గం ఓట్లు ఏకపక్షంగా కాంగ్రెస్కు మళ్లుతాయని, అది మొత్తం 31 జడ్పీటీసీ స్థానాల్లో పార్టీ గెలుపు అవకాశాలను మెరుగుపరుస్తుందని ఒక బలమైన వాదన ఉంది. ఇదే సమయంలో, ఆమె రాజకీయ ప్రస్థానం లోని ఒడిదొడుకులు పార్టీలో మరో రకమైన చర్చకు దారితీస్తున్నాయి.

కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్కు వెళ్లి, ఎన్నికలకు ముందు తిరిగి సొంత గూటికి చేరడం (ఘర్ వాపసీ) పార్టీలోని సీనియర్ విధేయులకు మింగుడుపడని అంశం. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారిని కాదని, నిన్నగాక మొన్న వచ్చినవారికి కీలకమైన జడ్పీ చైర్మన్ పీఠాన్ని ఎలా అప్పగిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ఇది పార్టీలో వర్గపోరుకు ఆజ్యం పోసే ప్రమాదం లేకపోలేద

 అంతర్గత పోరు.. అధిష్టానం లెక్కలు..

ఆకుల లలిత పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ, తెరవెనుక మరికొందరు ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. పార్టీకి మొదటి నుంచి సేవ చేస్తున్న తమకే అవకాశం ఇవ్వాలని వారు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షులు, జిల్లాకు చెందిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పాత్ర కీలకం కానుంది. ఆయన ఆకుల లలిత వంటి అనుభవజ్ఞురాలి వైపు మొగ్గుచూపుతారా, లేక పార్టీ విధేయులకు పెద్దపీట వేస్తారా అన్నది తేలాల్సి ఉంది.

వ్యూహ ప్రతి వ్యూహాల్లో పెద్దలు..

అధిష్టానం ముందు కొన్ని లెక్కలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గెలుపు గుర్రం ఆకుల లలితను నిలబెడితే, ఆమె వ్యక్తిగత ప్రతిష్ట, మున్నూరు కాపు సామాజికవర్గ బలం పార్టీకి మెజార్టీ సీట్లు తెచ్చిపెడతాయని భావిస్తున్నారు.అలాగే ఆమెకు పదవి ఇస్తే, పార్టీలోని ఇతర వర్గాల నుంచి ఎదురయ్యే అసంతృప్తిని ఎలా ఎదుర్కోవాలో లెక్కలు వేస్తున్నారు.

పార్టీకి నష్టం జరగకుండా ఎలా ఆకుల లలిత అభ్యర్థిత్వం ఖరారు చేయాలని పార్టీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. అదే సమయంలో దీర్ఘకాలిక వ్యూహం రచించాలని, రాబోయే రోజుల్లో బీజేపీని రాజకీయంగా ఎదుర్కోవడానికి ఆకుల లలితను వాడుకోవాలని సమీకరణలు చేస్తున్నారు.

తుది అంకంలో...

నిజామాబాద్ జడ్పీ చైర్మన్ ఎన్నిక, ఆకుల లలిత రాజకీయ భవిష్యత్తును మాత్రమే కాదు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు, వ్యూహాత్మక పటిమకు ఒక అగ్నిపరీక్షగా నిలవనుంది. పార్టీ గెలుపు కోసం అనుభవజ్ఞులైన మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అయిన ఆకుల లలితకు పట్టం కడుతుందా, లేదంటే ఇతర విధేయులకు న్యాయం చేస్తుందా? అనే నిర్ణయమే జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని రాబోయే ఐదేళ్లపాటు శాసించనుంది.

రాష్ట్రంలో పార్టీ మార్పు సాధారణం అయిపోయింది. నిజం చెప్పాలంటే ఒక్క కార్యకర్తలు తప్పా మెజార్టీ నాయకులు ఏదో ఒక సమయంలో పార్టీలు మారిన వారే. గోడ దూకిన వాళ్ళ జాబితానే పెద్దగా  తుది ఉంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బడా నాయకులు గతంలో గోడ దూకిన వారే. అందుకనే ఆకుల లలిత గతంలో పార్టీ మారడం సమస్య కాబోదని అనుచరులు అంటున్నారు.

ఆర్థిక, అంగ బలం కలిగిన ఆమెకు సాటిగా పార్టీలో ఎవరు లేరంటున్నారు. జిల్లాలో సైతం ఒకరిద్దరు బడా లీడర్లు తప్పా అందరూ గతంలో పార్టీ మారారని గుర్తు చేస్తున్నారు. ఆమె రాజకీయ పుట్టుకే కాంగ్రెస్ కాబట్టి స్వంత ఇంటికి వచ్చామని ఆమె చెప్పడాన్ని విస్మరించవద్దని పేర్కొంటున్నారు. అయితే తుది నిర్ణయం వెలువడే వరకు ఈ ఉత్కంఠ కొనసాగడం ఖాయం.