10-10-2025 11:34:05 AM
హైదరాబాద్: అంజన్ కుమార్ యాదవ్(Anjan Kumar Yadav)తో కాంగ్రెస్ బుజ్జగింపులు ప్రారంభించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో(Jubilee Hills by election) టికెట్ రాకపోవడంతో అంజన్ కుమార్ అలిగారు. ఈ నేపథ్యంలోనే అంజన్ కుమార్ తో మంత్రి వివేక్ భేటీ అయ్యారు. అంజన్ కుమార్ యాదవ్ సీనియర్ నేత అని వివేక్ పేర్కొన్నారు. అంజన్ కుమార్ టికెట్ రాకపోవడంపై అలిగారని చెప్పారు. కాంగ్రెస్ కోసం అంజన్ కుమార్ కుటుంబం కష్టపడిందని వెల్లడించారు. అంజన్ కుమార్ కు పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. జూబ్లీహిల్స్ లో రాజకీయ పరిస్థితుల ఆధారంగా నవీన్ కుమార్ యాదవ్ కు టికెట్ ఇచ్చారని మంత్రి వివేక్ స్పష్టం చేశారు.
అటు అంజన్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ... కార్యకర్తలతో భేటీ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. 40 ఏళ్ల నుంచి నేను పార్టీలో ఉన్నానని తెలిపారు. మనోభావాలు దెబ్బతిన్న చాలామంది నా దగ్గరకు వస్తున్నారని చెప్పారు. నాకు టికెట్ రాకుండా చేసిందెవరో త్వరలో చెబుతా అన్నారు. నా హక్కుల కోసం నేను మాట్లాడొద్దా?, ఉప ఎన్నికలో పోటీ చేయడానికి నేను అర్హుడినా.. కాదా?, కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసింది ఎవరు?, అభ్యర్థి ఎంపికలోనూ తనను సంప్రదించరా?, ఇప్పుడు మాత్రమే లోకల్, నాన్ లోకల్ ఇష్యూ ఎందుకు వచ్చింది?, గతంలో కామారెడ్డిలో పోటీ చేసినప్పుడు ఇది గుర్తుకు రాలేదా? అంటూ అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పలు ప్రశ్నలు సంధించారు. కనీసం జూబ్లీహిల్స్ కమిటీలోకైనా నన్ను తీసుకున్నారా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లు తొక్కుకుంటూ పోతే, మేం ఎక్కుకుంటూ పోతామని అంజన్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.