calender_icon.png 10 October, 2025 | 7:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలిచి.. మోదీకి గిఫ్ట్‌గా ఇవ్వాలి

10-10-2025 02:33:51 PM

హైదరాబాద్:  బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల(Jubilee Hills by election) సమన్వయ సమావేశంలో భాగంగా భాగ్యనగరంలోని ఎనిమింది జిల్లాల ప్రధాన నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతం, ఎన్నికల వ్యూహం, బూత్ స్థాయి సమన్వయం వంటి కీలక అంశాలపై గ్రేటర్ పరిధి జిల్లాల నాయకులకు అధ్యక్షుడు రామచందర్ రావు(Ramachandra Rao) దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అమలుకు నోచుకోని ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో జూబ్లీహిల్స్ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని విమర్శించారు. గత పదేళ్ల  బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అరాచకమే పరాకాష్టకు చేరిందన్నారు. ఈ రెండు పార్టీల వైఫల్యాల వలన విసుగుచెందన ప్రజలు ఇప్పుడు బీజేపీ పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందించగల శక్తి ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమేనని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ గెలుస్తుందనే నమ్మకం ఉందని రామచందర్ రావు అన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. రెండు, మూడు రోజుల్లో జూబ్లీహిల్స్ అభ్యర్థిని ఖరారు చేస్తామన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలిచి మోదీకి గిఫ్ట్ గా ఇవ్వాలని పార్టీ నేతలను కోరారు. జూబ్లీహిల్స్ లో బీజేపీని గెలిపించి రాజకీయ మార్పు చూడండన్నారు.  కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎంఎల్సీ ఏ.వి.ఎన్. రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే చింతల రాంరెడ్డి, ప్రభారి అభయ్ పాటిల్,  రాష్ట్ర పదాధికారులు, కార్పొరేటర్లు, హైదరాబాద్ పరిధిలోని జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.