10-10-2025 01:41:15 PM
నరెడ్కో ఆధ్వర్యంలో హైటెక్స్‌లో ప్రాపర్టీ షో ప్రారంభం
అన్ని వైపులా హైదరాబాద్ అభివృద్ధి చెందేలా ప్రణాళికలు: భట్టి
హైదరాబాద్: నరెడ్కో ఆధ్వర్యంలో హైటెక్స్ లో ప్రాపర్టీ షో(NAREDCO Telangana Property Show) ఏర్పాటు చేశారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka ), మంత్రి జూపల్లి కృష్ణరావు ప్రాపర్టీ షోను ప్రారంభించారు. నరెడ్కో బ్రౌచర్ ను ఆవిష్కరించారు. మూడు రోజుల పాటు ప్రాపర్టీ షో కొనసాగనుంది. విల్లాలు, అపార్ట్ మెంట్ల వివరాలు తెలిపేలా ప్రాపర్టీ షోలో పలు స్థిరాస్తి సంస్థల స్టాళ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వనరులు, అవకాశలపై ప్రచారం బాధ్యత నరెడ్కోపై ఉందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అన్ని వైపులా హైదరాబాద్ అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.
హైదరాబాద్ అభివృద్ధికి ఏటా రూ. 10 వేల కోట్లు కేటాయిస్తున్నామని సూచించారు. హైదరాబాద్ అభివృద్ధికి(Hyderabad Development) రెండేళ్లలో రూ. 20 వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. మూసీనది సుందరీకరణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. రీజినల్ రింగ్ రోడ్డుతో(Regional Ring Road) నగర ముఖచిత్రం మార్చబోతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కలిపేలా ఆర్ఆర్ఆర్ నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. హైడ్రాతో(Hyderabad Disaster Management and Asset Protection Agency ) కొంత భయం ఏరపడినా ఫలితాలు కనిపిస్తున్నామని తెలిపారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలు, చెరువులను హైడ్రా కాపాడుతోందని భట్టి విక్రమార్క కొనియాడారు.