ఆలయ భూమి కబ్జా చేసేందుకు వాటర్‌ట్యాంక్ తొలగింపు
జహీరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి) : ఆలయ భూమిని కబ్జా చేసేందుకు వాటర్ ట్యాంకును తొలగించినట్లు గ్రామస్తులు తెలిపారు. దీనికి సంబంధించి గ్రామస్తులు, వార్డు మెంబరు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జరాసంఘం మండలం కుప్పా నగర్ గ్రామంలో గల సర్వే నంబర్ 181లో 5 ఎకరాల భూమి దుర్గమ్మ గుడి పేర పట్టగా రెవెన్యూ రికార్డులో నమోదయింది. గతంలో కొంత భూమిని ఆలయ ట్రస్ట్ విక్రయించి ఆలయాన్ని పునర్ నిర్మించగా మిగతా భూమిని కొందరు ఆక్రమిస్తూనే ఉన్నారు.
తాజాగా గుడి వెనుక భాగంలో గల వాటర్ ట్యాంకు నిర్మించి ఉండగా దానిని కబ్జా చేసేందుకు తొలగించారు. ఈ విషయం గ్రామ పంచాయతీకి తెలవకుండానే ట్యాంకును తీసి మరో స్థలంలో పెట్టారు. గ్రామానికి చెందిన కొందరు వార్డు సభ్యులు గ్రామపంచాయతీ కార్యదర్శి స్వప్నను వివరణ కోరగా తాను సెలవులో ఉన్నప్పుడు తొలగించారని దీనిపై ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు వార్డు సభ్యులు తెలిపారు.
ఏది ఏమన్నాప్పటికీ దుర్గమ్మ గుడికి ఉన్న ఐదు ఎకరాల భూమిలో కబ్జా చేసేందుకు ఎప్పుడు ఇస్తున్నారని ఆరోపించారు. వాటర్ ట్యాంకు పక్కన ఇంటి యజమాని దారిని కూడా తగ్గించి ఇల్లు నిర్మించినప్పటికీ ఏ అధికారులు కూడా చర్యలు తీసుకోవడం లేదన్నారు. గ్రామానికి చెందిన కొందరు రెవెన్యూ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. గ్రామ ప్రజలకు గాని గ్రామసభలో కానీ గ్రామ పంచాయతీలో చర్చించకుండా ట్యాంకును తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని వార్డు సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు.






