05-09-2025 07:22:29 PM
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో రెవెన్యూ శాఖ సిబ్బంది ఉవ్వెత్తున పాల్గొన్నారని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. గ్రామ పాలన అధికారులకు నియామక పత్రాలు అందజేత కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర సాధనలో రెవెన్యూ శాఖ సిబ్బంది కీలక పాత్ర పోషించారని.. రాష్ట్ర సాధనలో ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్ శాఖ కార్మికులు పాల్గొన్నారని తెలిపారు. ఉద్యమంలో పాల్గొన్న సిబ్బందికి గత సీఎం మేలు చేస్తారని అందరూ ఆశించారన్నారు. భూమికి, తెలంగాణ ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉందని.. రాష్ట్రంలోని అన్ని పోరాటాలు భూమి చుట్టూ తిరిగాయని పేర్కొన్నారు. కొమురంభీమ్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, రావి నారాయణ రెడ్డి భూమి కోసమే పోరాడారని సీఎం అన్నారు. భూమికి, తెలంగాణ ప్రజలకు మధ్య ఉన్న బంధం.. తల్లీబిడ్డకు ఉన్న సంబంధం ఉందని.. భూమిని ఆక్రమించుకోవాలని చూసిన వారిని తెలంగాణ ప్రజలు తరిమికొట్టారని తెలిపారు.
గత ప్రభుత్వం హయంలో సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోలేదని.. ప్రజలను దోచుకున్నది రెవెన్యూ ఉద్యోగులే అన్నట్లు గత ప్రభుత్వం చిత్రీకరించిందన్నారు. ధరణి వివరాలు ప్రజలకు తెలియకూడదని వీఆర్వో, వీఆర్ఏలను తొలగించారని.. వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను తొలగించకపోతే వారి దుర్మార్గాలు తెలుస్తాయని భావించారు అని సీఎం తెలిపారు. ఎన్నికల ముందు ఎవరిని పలకరించినా ధరణి సమస్యలు విన్నవించేవారని.. ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చానని అన్నారు. రెవెన్యూశాఖ కావాలని పొంగులేటి అడగలేదు.. వారి సమర్థత గుర్తించి ఇచ్చామని సీఎం పేర్కొన్నారు. ధరణితో పట్టుకున్న దరిద్రాన్ని.. భూభారతితో తొలగించే ప్రయత్నం చేశామని.. గత ప్రభుత్వంలో తహసీల్దార్ ను పెట్రొల్ పోసి తగులబెట్టారని అన్నారు.