20-08-2025 05:45:35 PM
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): భారతదేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని మాజీ జెడ్పిటిసి, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి అన్నారు. భారత మాజీ ప్రధాని, దివంగత నేత రాజీవ్ గాంధీ 81వ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్ లో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్యతో కలిసి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి ఐటీ విప్లవాన్ని తీసుకువచ్చి నవభారత నిర్మాణానికి నాంది పలికాడని అన్నారు. అదేవిధంగా వాణిజ్య రంగాన్ని ఎంతో మెరుగుపరచాడని పేర్కొన్నారు. సుస్థిర పాలన కొనసాగించి పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేశాడన్నారు. చిన్న వయసులోనే ప్రధానిగా రాజీవ్ గాంధీ దేశానికి ఎన్నో సేవలు అందించాడని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాలను రాహుల్ గాంధీ కొనసాగిస్తున్నాడని, ఓట్ల చోరీపై పోరాటాలు చేస్తున్నాడన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికలలో రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు.