20-08-2025 06:13:56 PM
గంభీరావుపేట మండలంలో నిర్వహించిన పశువుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్
గంభీరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాడి పశువులను సద్వినియోగం చేసుకొని పేద కుటుంబాలు ఆర్థికంగా వృద్ధి చెందాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు. గంభీరావుపేట మండలం దేశాయిపల్లి గ్రామంలోని ప్రగతిభవన్ లో 17 మంది ఎస్సీ లబ్ధిదారులకు ఒక్కరికి 2 చొప్పున మొత్తం 34 పాడి పశువులను కలెక్టర్ బుధవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, ప్రస్తుతం పంపిణీ చేసే పశువులకు డెలీవరి తర్వాత 12 నుంచి 15 లీటర్ల పాలు అందిస్తాయని, ఎస్సీ లబ్ధిదారులకు నేడు రెండు పశువులను సబ్సిడీపై అందిస్తున్నామని, వీటిని వినియోగించుకుంటూ ఆర్థికంగా ప్రజలు ఎదగాలని, రెండు. పశువులను క్రమం పద్ధతిలో పది పశువుల స్థాయికి పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు.
పశువులకు సంబంధించి డైట్ చార్ట్ తెలుగు లో తయారు చేసి లబ్ధిదారులకు అందించాలని పశు వైద్యాధికారిని ఆదేశించారు. నేడు 17 మంది లబ్ధిదారులకు ఇక్కరికి 2 చొప్పున 34 పశువులు పంపిణీ చేస్తున్నామని భవిష్యత్తులో ప్రతి మండల స్థాయిలో ఇటువంటి కార్యక్రమంలో నిర్వహిస్తామని తెలిపారు. హర్యానా నుంచి వచ్చిన పశువులు స్థానికంగా అలవాటు పడడానికి వారం రోజులు సమయం పడుతుందని వెల్లడించారు.
సబ్సిడీతో పంపిణీ చేసిన పశువులను బయట అమ్మడానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి పశువుకు భీమా సౌకర్యం కూడా కల్పించామని తెలిపారు. పశువుల ద్వారా రోజూ 2000 రూపాయల వరకు ఆదాయం లభిస్తుందని అన్నారు. హర్యానా పశువులను తీసుకుని రావడంతో కృషి చేసిన వెటర్నరీ అధికారులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు.
వర్షాకాలంలో పచ్చి గడ్డి బాగా దొరుకుతుందని, వీటిని వినియోగించుకుని పశువులకు మంచి ఆహారం అందించాలన్నారు.ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేసిన పేద కుటుంబాలకు పశువులు పంపిణీ చేస్తున్నామని అన్నారు.బర్రెలకు ఆరోగ్యపరంగా, బీమా, వైద్య సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ డైరీలకు లబ్ధిదారులు పాలు పోయాలని ఆయన సూచించారు. పశువులను జాగ్రత్తగా చూసుకోవాలని, లేగ దూడలకు పాలు కొంత వదిలి మిగిలినవి పిండుకోవాలని, లేగ దూడల పోషక లోపాలు రాకుండా చూసుకుంటే మంచి జరుగుతుందన్నారు.