19 August, 2026 | 1:08 AM

విదేశీ పర్యటనకు సీఎం రేవంత్

19-08-2026 12:17 AM
  1. నేడు ఢిల్లీలో సీడబ్ల్యూసీ భేటీకి హాజరు.. రాత్రి యూకేకు పయనం
  2. యూకే, యూఎస్‌లో 29వరకు సీఎం పర్యటన   
  3. ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, హార్వర్డ్, ఎంఐటీల సందర్శన    
  4. 30న తిరిగి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం

హైదరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 12 రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఈనెల 29వరకు ఆయన యూకే, అమెరికాలో పర్యటించనున్నారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లిన సీఎం.. బుధవారం ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో పాల్గొంటారు. అదే రోజు రాత్రి ఢిల్లీ నుంచి యూకేకు వెళ్తారు.

యూకే, యూఎస్‌లో కీలక పర్యటనలు

21న ఉదయం 10.30 గంటలకు కేలోని బల్వాత్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని సీఎం సందర్శించనున్నారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఎమిరేట్స్ స్టేడియాన్ని సందర్శిస్తారు. 22వ తేదీ ఉదయం 10.30 గంటలకు కేంబ్రిడ్జ్ టీంతో ఇంటరాక్షన్‌లో పాల్గొంటారు. ఉదయం 11.30 గంటలకు సెనెట్ హౌస్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్‌ను సందర్శిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు లండన్ బిజినెస్ స్కూల్‌ను సందర్శించనున్నారు.

23న లండన్ నుంచి అమెరికాకు సీఎం చేరుకుంటారు. అక్కడ కూడా వరుస కార్యక్రమాల్లో పాల్గొంటారు. 24న ఉదయం 10.30 గంటలకు హార్వర్డ్ యూనివర్సిటీని, సాయంత్రం 4 గంటలకు ఎంఐటీ క్యాంపస్‌ను సందర్శిస్తారు. అదే రోజు రాత్రి 7 గంటలకు బోస్టన్ నుంచి న్యూయార్క్‌కు చేరుకుంటారు. 25న ఉదయం 10.30 గంటలకు బోస్టన్‌లోని నార్త్‌ఈస్టర్న్ క్యాంపస్‌ను సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు వర్జీనియా టెక్ యూనివర్సిటీ టీంతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. విద్య, పరిశోధన, సాంకేతికత తదితర అంశాలపై ఆయా సంస్థల ప్రతినిధులతో సీఎం చర్చించనున్నారు.

26న ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశం

26న ఉదయం 7 గంటలకు న్యూయార్క్‌లో జరిగే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. అనంతరం 29న న్యూయార్క్ నుంచి తిరుగు ప్రయాణం ప్రారంభిస్తారు. ఆగస్టు 30న హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.