calender_icon.png 5 May, 2025 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నన్ను కోసినా.. వచ్చిన ఆదాయానికి మించి ఏమీ చేయలేను: సీఎం రేవంత్

05-05-2025 06:02:55 PM

హైదరాబాద్‌: తెలంగాణలో పోలీసులు శాంతిభద్రతలు కాపాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ వేదిక(ICCC Program)గా తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్ పేరుతో ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రపంచస్థాయి పెట్టుబడులకు ఆకర్శించగలుగుతోందని, సరిహద్దుల్లో సైనికుల్లా రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షిస్తున్నారని సీఎం తెలిపారు. విధి నిర్వహణలో చనిపోయినా పోలీసుల కుటుంబలకు భరోసా ఇస్తున్నామని, విధి నిర్వహణలో మరణించినా ఐపీఎస్ ల కుటుంబాలకు రూ.2 కోట్లు, అదనపు ఎస్సీ, ఎస్పీ కుటుంబాలకు రూ. కోటిన్నర అందిస్తున్నామన్నారు.

పోలీసుల పిల్లల కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూళ్ల ఏర్పాటు, నేరం జరగకుండా నియంత్రించే బాధ్యత పోలీసులపై ఉందని సీఎం రేవంత్ అన్నారు. ఇక సమరమే అని ఉద్యోగ సంఘాలు ప్రకటిస్తున్నాయన్నారు. మీ సమరం తెలంగాణ ప్రజలపైనా..? మొదటి తారీఖునే జీతాలు ఇస్తునందుకా..? మీ సమరం అని ప్రశ్నించారు. కొన్ని రాజకీయ పార్టీలు మాపై ఆరోపణలు చేస్తున్నాయని, ఉచిత విద్యుత్ పేరుతో విద్యుత్ శాఖకు బకాయిలు పెట్టి వెళ్లారని మండిపడ్డారు.

ప్రభుత్వం అంటే మేం ఒక్కరమే కాదు.. మనమంతా కలిస్తేనే ప్రభుత్వం అని సీఎం రేవంత్ అన్నారు. మనం పాలకులం కాదు.. సేవకులం అని, ఆర్థిక ఇబ్బందులో ఉంటే సహకరించాల్సిన ఉద్యోగ సంఘాలే సమరం అంటున్నాయని ఆరోపించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే అండగా ఉండాల్సినా బాధ్యత ఉద్యోగ సంఘాలపై లేదా..? సమస్య ఉంటే చర్చించుకుందామని ఉద్యోగ సంఘాలపై విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని రాజకీయ పార్టీల కుట్ర అని, రాజకీయ పార్టీల కుట్రలో ఉద్యోగ సంఘాలు పావులుగా మారొద్దని చెప్పారు. ఉద్యోగ సంఘాల తీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుందన్నారు. ఉద్యోగ సంఘాలు బాధ్యత మరిస్తే సమాజం సహించదని, అప్పులు పుట్టినా ఏదైనా చేయొచ్చు.. ఎక్కడా అప్పు పుట్టట్లేదు అని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని, స్వీయ నియంత్రణే పరిష్కారమని అన్నారు. ప్రభుత్వం మన కుటుంబం.. కుటుంబ పరువును బజారున పడేయొద్దు అని పేర్కొన్నారు. నన్ను కోసినా వచ్చినా ఆదాయానికి మించి ఏమీ చేయలేనని, ఇప్పుడు కావాల్సింది సమరం కాదు.. సమయస్పూర్తి, సంయమనం అని అన్నారు. తెలంగాణను మళ్లీ కోతుల గుంపునకు అప్పగించోద్దని, నాతో కలిసి రండి.. తెలంగాణను అభివృద్ది పథంలో తీసుకెళ్దామని సీఎం తెలిపారు.