27-09-2025 08:47:39 PM
దసరా కానుకగా సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు..
అధికారులతో సమన్వయం చేసి ప్రొసీడింగ్స్ అందించే బాధ్యత వెలిచాలకు అప్పగింత..
కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు ముందే బతుకమ్మ దసరా పండుగ వచ్చేసింది. ఇందుకు ప్రధాన కారణం ఏంటంటే ఇందుకో విశేషం ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి సొంతంటి కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ నియోజకవర్గంలో దసరా కానుకగా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశారు. దాదాపు 4 వేల మంది లబ్ధిదారులకు ఇండ్లను మంజూరు చేయడం విశేషం. బతుకమ్మ దసరా పండుగకు ముందే సొంతంటి కలను ముఖ్యమంత్రి నెరవేర్చడం విశేషంగా చెప్పుకోవచ్చు. కరీంనగర్ నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయించడంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు కీలకపాత్ర పోషించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడి ఎన్నికలు వచ్చేస్తున్న వేళ తక్షణమే లబ్ధిదారులకు వాటిని మంజూరు చేయాలని కోరారు.
అందుకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఇందిరమ్మ ఇండ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరీంనగర్ నియోజకవర్గంలో అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని ఎంపిక చేసిన లబ్ధిదారులకు సత్వరమే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ అందించే బాధ్యతను వెలిచాల రాజేందర్రావుకు అప్పగించారు. అధికారులతో మాట్లాడి ప్రొసీడింగ్స్ అందించే బాధ్యత చూడాలని ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన వెలిచాల రాజేందర్ రావు అధికారులతో సమన్వయం చేసుకొని వెంటనే నియోజకవర్గ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన లబ్ధిదారులకు ప్రోసిడింగ్స్ అందేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడి సత్వరమే ప్రొసీడింగ్స్ అందించేలా కృషి చేశారు.అదేవిధంగా కరీంనగర్ నియోజకవర్గంలో ఐదు లక్షల జనాభా ఉందని దీనికి అనుగుణంగా అదనంగా మరో నాలుగు వేల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజేందర్రావు కోరారు.
మొదటి విడతలో 4000 మంజూరు చేశారని అదనంగా రెండో విడతలో మరో నాలుగు వేలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. తప్పకుండా మరో 4000 మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే బాధ్యత తాను తీసుకుంటానని ముఖ్యమంత్రి పేర్కొన్నారని రాజేందర్ రావు తెలిపారు. అనేక ఏళ్ల నుంచి సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదలకు బతుకమ్మ దసరా పండుగ వేళ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇందిరమ్మ లబ్ధిదారుల వద్దకే ప్రొసీడింగ్ కాపీలు రావడంతో ఆనందంలో మునిగితేలుకుతున్నారు. ఇది కలనా నిజమా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు ఇందిరమ్మ ఇండ్లు మంజులైన వేల రెట్టింపు ఉత్సాహంతో బతుకమ్మ దసరా వేడుకలను జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చెప్పారని రాజేందర్రావు పేర్కొన్నారు.
శనివారం సాయంత్రం కొత్తపల్లి మండలం కమాన్ పూర్ నాగుల మల్యాల గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ప్రొసీడింగ్స్ ను అందజేశారు. లబ్ధిదారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరుతో తమ కల సాకారం అవుతున్నదని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెలిచాల రాజేందర్రావు మాట్లాడుతూ దసరా పండుగకు కానుకగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశారని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన వేల రెట్టింపు ఉత్సాహంతో లబ్ధిదారులు బతుకమ్మ దసరా వేడుకలను జరుపుకోవాలని సూచించారు. కరీంనగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం ఏర్పడిందని, అర్హులైన ప్రతి పేద వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యేలా తాను ప్రత్యేకంగా కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పంజాల స్వామి గౌడ్ కాంగ్రెస్ నాయకులు బోనాల మురళి కృష్ణ, పెంట శేఖర్, నిమ్మల అంజయ్య, రుద్ర మనోహర్ సామి, పంజాల కృపాసాగర్, భూస సందీప్ బూస సంపత్, అరిగెల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.