27-09-2025 09:20:52 PM
జిల్లా ఎక్సైజ్ అధికారి నవీన్ చంద్ర
సంగారెడ్డి (విజయక్రాంతి): ప్రొహిబిషన్, ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో 2025–27 మద్యం పాలసీకి సంబంధించి సంగారెడ్డి జిల్లాలో మొత్తం 101 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి యస్.నవీన్ చంద్ర తెలిపారు. సంగారెడ్డి స్టేషన్ పరిధిలో 24, పటన్చెరు 35, జహీరాబాద్ 16, నారాయణఖేడ్ 13, అందోల్ 13, మొత్తం 101 మద్యం దుకాణాలలో రెండు ఎస్.టి 13, ఎస్.సి, 9 గౌడ కులస్తులకు రిజర్వేషన్ కల్పించబడిందని ఆయన వివరించారు. ఈ కేటాయింపులను జిల్లా కలెక్టర్ సమక్షంలో డ్రా తీయడం ద్వారా కేటాయించినట్లు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ఈనెల 26 నుంచి అక్టోబర్ 18 వరకు జరుగుతుందన్నారు.
ఆసక్తిగల అభ్యర్థులు సంగారెడ్డి జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి కార్యాలయం లేదా నాంపల్లి లోని కమిషనర్ కార్యాలయంలో పని దినములలో ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. ఈ దరఖాస్తులకు అక్టోబర్ 23న ఉదయం 11 గంటలకు పోతిరెడ్డిపల్లిలోని జె.ఎన్.ఆర్. గార్డెన్ లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. మద్యం దుకాణాలకు దరఖాస్తు చేయదలచిన దరఖాస్తుదారులు రూ.3 లక్షల డిమాండ్ డ్రాఫ్ట్ ను జిల్లా బృహబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ సంగారెడ్డి పేరుమీద సమర్పించాల్సి ఉంటుంది. మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్, పాన్ కార్డు ప్రతులు తప్పనిసరిగా జతచేయాలి. రిజర్వేషన్ కేటగిరీకి దరఖాస్తు చేసే వారు ప్రభుత్వంచే జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం, స్వీయ ధృవీకరణ పత్రం సమర్పించాలని ఎక్సైజ్ అధికారి నవీన్ చంద్ర తెలిపారు.